వైసీపీకి టచ్‌లో అస్మిత్…వ్యూహమే?

రాజకీయాల్లో పార్టీల వ్యూహాలు మామూలుగా ఉండటం లేదు..ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి తమదైన శైలిలో ఎత్తులు వేసి…ప్రత్యర్ధులని చిత్తు చేయాలని చూస్తున్నారు. అసలు ఏమి లేని విషయాన్ని ఏదో ఉందన్నట్లు క్రియేట్ చేసి ప్రత్యర్ధులతో మైండ్ గేమ్ ఆడేస్తున్నారు. ఇలా మైండ్ గేమ్ ఆడటంలో అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని ఆరితేరిపోయాయి. ముఖ్యంగా కొందరు నేతలు పార్టీలు మారిపోతారంటూ…సరికొత్త కథనాలు సృష్టిస్తున్నారు.

అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఎవరికి క్లారిటీ లేకుండా పోతుంది. ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేయొచ్చు అని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆనం రామ్ నారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి…వైసీపీని వదిలి టీడీపీలోకి వస్తున్నారని ఈ మధ్య ప్రచారం జరిగింది. గతంలో ఈ ఇద్దరు టీడీపీలో పనిచేసి వచ్చిన వారే. ఇక వైసీపీలో ఉండలేక మళ్ళీ వీరు టీడీపీలోకి రాబోతున్నారని కథనాలు వచ్చాయి.

కానీ ఈ కథనాల్లో నిజం లేదని తేలిపోయింది…తాము పార్టీ మారే ప్రసక్తి లేదని గతంలోనే ఈ ఇద్దరు నేతలు తేల్చి చెప్పేశారు. మరి వీరి విషయంలో ఓ మైండ్ గేమ్ ప్లే చేశారని చెప్పొచ్చు. అదే సమయంలో టీడీపీ నుంచి కొందరు నేతలు వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం మొదలైంది. అందులోనూ కీలకమైన జేసీ ఫ్యామిలీకి చెందిన అస్మిత్ రెడ్డి…వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఇక్కడొక లాజిక్ ఉంది…అస్మిత్ ఒక్కరే పార్టీ మారడం కష్టం…తన తండ్రి ప్రభాకర్ రెడ్డి, అలాగే తన పెదనాన్న దివాకర్ రెడ్డి, అన్న పవన్ రెడ్డి టీడీపీలో ఉండగా, ఈయన ఒక్కరే టీడీపీ వదిలి వైసీపీలోకి వస్తారనేది లాజిక్ లేని విషయం. వైసీపీపై నెగిటివ్ పెరుగుతున్న సమయంలో జేసీ ఫ్యామిలీ వైసీపీ చూస్తుందా? అనేది పెద్ద డౌట్. కానీ అస్మిత్ పార్టీ మారుతున్నారనేది…ప్రత్యర్ధుల వ్యూహంలో భాగంగా జరుగుతున్న ప్రచారమని జేసీ అనుచరులు అంటున్నారు. మొత్తానికైతే అస్మిత్ వైసీపీ వెళ్ళే అవకాశాలు ఏ మాత్రం లేవని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.