బన్నీ కోసం అద్భుతమైన స్క్రీప్ట్ రెడీగా ఉంది.. గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 1997లో ‘మిన్సర కనపు’ అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో మాధవన్ తో ‘మిన్నెల’ అనే సినిమాను తెరకెక్కించారు. అలా దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన పలు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళంలోనే కాదు తెలుగులో ఆయన నేరుగా సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘ఘర్షణ’, ‘ఏమాయ చేసావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా గౌతమ్ మీనన్ కి పేరు ఉంది.. ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాలోనూ గౌతమ్ మీనన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. తాజాగా ఆయన శింబు హీరోగా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో సినిమా తెరకెక్కించారు. సెప్టెంబర్ 17న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్వించబడుతుంది.

ఇదిలా ఉంటే గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పనిచేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. బన్నీ కోసం తన వద్ద అద్భుతమైన స్క్రిప్ట్ రెడీగా ఉందని అన్నారు. అది త్వరలోనే జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు. బన్నీని దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేసినట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కోసం ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్ ను రెడీ చేశారట.. అయితే గౌతమ్ మీనన్ దర్వకత్వంలో సినిమా చేయడానికి బన్నీ ఒప్పుకుంటాడా? అనేది ఆలోచించాల్సిన విషయమే.. ఇప్పటికే తెలుగులో వెంకటేష్, చైతన్య, నాని వంటి హీరోలతో సినిమా తీశారు. మరి కొన్ని రోజుల్లో రామ్ పోతినేని హీరోగా సినిమా తెరకెక్కించబోతున్నారు..