వైసీపీకి డేంజ‌ర్ బెల్స్‌.. సంక్షేమం ఓట్లు రాల్చ‌డం క‌ష్ట‌మేనా?

ప్ర‌జ‌ల మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుంది.. అని అడిగితే.. ప్ర‌ముఖ నాయ‌కుడు ఒక‌రు ఇలా అన్నారు.. “ఉగాది ప‌చ్చ‌డి లాంటిది“అని! ఔను.. ష‌డ్ర‌శోపేత‌మైన ఉగాది ప‌చ్చడిలాగే ప్ర‌జ‌ల నాడి ఉంటుంద‌నేది నిజం. ఏ నాయ‌కుడైనా.. ఏ పార్టీ అయినా.. అన్ని ర‌కాలుగా.. అన్ని విధాలుగా త‌మ‌ను ఆద‌ర్శిస్తుందంట‌నే.. ఆ పార్టీకి, ఆ నేత‌కు ప్ర‌జలు జైకొడ‌తారు. లేదు.. మేం ఒక‌వైపే చూస్తాం! అంటే.. ఇది విక‌టించే ప్ర‌మాద‌మే ఎక్కువ‌. ఇప్పుడు ఈ విష‌యమే తాజాగా.. ఏపీ అధికార పార్టీ వైసీపీ విష‌యంలోనూ జ‌రుగుతోంది.

2019లో వైసీపీని ప్ర‌జ‌లు ఘ‌నంగా ఆద‌రించారు. 151 సీట్ల‌తో విజ‌యం ద‌క్కేలా చేసి.. అఖండ మెజారిటీతో జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేశారు. అయితే.. ఆయ‌న మాత్రం `ఒక‌వైపే చూస్తున్నారు` కేవ‌లం సంక్షేమం అజెండాతోనే ఇప్ప‌టి వ‌ర‌కు పాల‌న చేశారు. భారీ ఎత్తున అప్పులు చేస్తున్నారు. అంతేకాదు.. అప్పులు ఎందుకు చేస్తున్నారంటే.. ప్ర‌జ‌ల‌కు పంచేందుకు అని గొప్ప‌గానే చెబుతున్నారు. ఇలా అప్పులు చేసి మ‌రీ.. పంచుతున్న‌ సంక్షేమం.. జ‌గ‌న్ నిర్దేశిత 30 ఏళ్ల అధికారం క‌ట్ట‌బెడుతుంద‌ని.. వారు న‌మ్ముతున్నారు.

వైసీపీ నాయ‌కులు ఎక్క‌డ నోరు విప్పినా.. ఇదే చెబుతున్నారు. త‌మ‌ది సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని.. త‌మ సంక్షేమ‌మే త‌మ‌కు శ్రీరామ ర‌క్ష అని అంటున్నారు. అయితే.. తాజాగా వ‌చ్చిన స‌ర్వేలో మాత్రం సంక్షేమం కొంత వ‌ర‌కే కాపాడుతుంద‌ని.. స్ప‌ష్ట‌మైంది. కేవ‌లం సంక్షేమాన్ని న‌మ్ముకోవ‌డం అంటే.. గాలిలో దీపం పెట్ట‌డ‌మేన‌ని హెచ్చ‌రించింది. ఇప్పుడు వైసీపీ చేస్తున్న‌ది అదే. పోనీ.. ఆ పార్టీ ప్ర‌వ‌చిస్తున్న సంక్షేమం అయినా.. అంద‌రికీ అందుతోందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

 

కేవ‌లం అట్ట‌డుగు వ‌ర్గాల‌కు మాత్రమే అది కూడా ఆచితూచి సంక్షేమాన్ని అందిస్తున్నారు. ఇది స‌మాజంలోని 15 శాతం మందికి మాత్ర‌మే చేరువ అవుతోంది. మ‌రి మిగిలిన 85 శాతం మంది ప‌రిస్థితి ఏంటి? ఇదే.. ఇప్పుడు వైసీపీకి పెను శాపంగా మారుతోంద‌ని స‌ర్వే కుండ‌బ‌ద్ద‌లు కొడుతోంది. వీరిలో ఉద్యోగులు ఉన్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, యువ‌త‌, విద్యార్థులు, మ‌హిళ‌లు కూడా ఉన్నారు. మ‌రి వీరికి జ‌గ‌న్ స‌ర్కారు వ‌ల్ల జ‌రుగుతున్న మేళ్లు ఏమిటి? అంటే.. స‌మాధానం ల‌భించ‌డం లేదు.

పైగా.. కొంద‌రికి అందుతున్న సంక్షేమం కోసం.. ఇన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు.. అనేక భారాల‌ను మోయాల్సి రావ‌డం.. ప‌న్నులు చెల్లించాల్సి రావ‌డం.. వంటివి జ‌గ‌న్ స‌ర్కారుపై వారి ఆశ‌ల‌ను అడియాస‌లు చేస్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ స‌ర్కారు సంక్షేమ అజెండాను మాత్ర‌మే న‌మ్ముకుంటే.. క‌ష్ట‌మ‌ని అంటున్నారు. ఇక‌, రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా క‌నిపించ‌క‌పోవ‌డం.. మ‌రో దారుణం. ఈ ప‌రిణామాల క్ర‌మంలో జ‌గ‌న్ సంక్షేమ అజెండా ఆయ‌న‌కే కాకుండా.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు కూడా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంద‌ని అంటున్నారు.