కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?

గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు.

దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని గెలవనివ్వమని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక వైసీపీ బలపడుతుండటంతో బాబు కూడా కుప్పంపై ఫోకస్ పెట్టారు..అక్కడ బలం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారు..మూడు నెలకొకసారి కుప్పం వెళుతున్నారు. తాజాగా కూడా కుప్పం వెళ్లారు. కానీ అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య పెద్ద రచ్చ నడిచింది.

ఈ గొడవలకు కారణం వైసీపీని టీడీపీ నేతలు…కాదు టీడీపీనే అని వైసీపీ నేతలు వాదించుకుంటున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలవరని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు. ఇక ఈ సవాల్‌కు టీడీపీ నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, మీపై మీకు అంత నమ్మకం ఉంటే… దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండని, ఒక్క కుప్పం ఏం ఖర్మ, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరేమిటో.. మేమేమిటో తేల్చుకుందామని టీడీపీ నేత బోండా ఉమా సవాల్ విసిరారు.

మరి ఈ సవాల్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి…కాకపోతే కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలని, అప్పుడు అక్కడ ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని వైసీపీ నేతలు మాట్లాడే ఛాన్స్ ఉంది. అంటే రాజకీయ నేతలు విసురుకునే సవాళ్ళు ఏవి పెద్దగా వర్కౌట్ కావు. అయితే కుప్పంలో గెలిచేస్తామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు గాని…అక్కడ అంత ఈజీగా గెలవడం మాత్రం కుదరని పని అని చెప్పొచ్చు.