సామాజిక వ‌ర్గాల సెగ‌లో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్క‌పోత‌…!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఎప్పుడూ.. అనుకూల‌తే ఉంటుంద‌ని చెప్ప‌డం క‌ష్టం. అందునా.. మూడేళ్లు పాల‌న పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్య‌తిరేక‌త స‌హ‌జంగానే ఉంటోంది. కానీ, ప‌లాస నుంచి రెండో సారి వ‌రుస‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయ‌న‌కు సొంత సామాజిక వ‌ర్గం నుంచి ఇత‌ర సామాజిక వ‌ర్గాల వ‌ర‌కు కూడా అంద‌రూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వ‌ర్గం అంటే.. అర్ధం చేసుకునే అవ‌కాశం ఉంది.

కానీ, ఇన్ని సామాజిక వ‌ర్గాలు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డం.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. నిజానికి సీదిరి అప్ప‌ల‌రాజు.. తొలిసారి ఎమ్మెల్యే క‌మ్ మంత్రి అయ్యారు. ఆయ‌న క‌ష్టం క‌న్నా కూడా ల‌క్ క‌లిసి వ‌చ్చి ఎమ్మెల్యే అయిన రెండేళ్ల‌కే మంత్రి అయ్యారు. ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచేందుకు అనేక సామాజిక వ‌ర్గాలు క‌ష్ట‌ప‌డ్డాయి. మ‌న వాడు.. పైకి వ‌స్తే.. మ‌న‌కు ఏదైనా న్యాయం చేస్తాడు.. అనే ఆశ‌తో .. కాళింగ‌, వాడ బ‌లిజ, అగ్నికుల క్షత్రియ సామాజ‌క వ‌ర్గాలు.. ఆయ‌న‌కు ద‌న్నుగా నిలిచాయి.

ఆయ‌న ఎమ్మెల్యే అయిన‌ప్పుడు.. ఈ సామాజిక వ‌ర్గాలు పండ‌గ చేసుకున్నాయి. మంత్రి అయిన‌ప్పుడు.. త‌మ ఇంటికే పండ‌గ వ‌చ్చిందా.. అని ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ గ్రాఫ్‌ను మంత్రి ఎక్కువ కాలం నిల‌బెట్టుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. వారిని మంత్రి ప‌ట్టించుకోవ‌డం మానేశారు. త‌న ఎదుగుద‌ల‌కు.. త‌న ఉన్న‌తికి బాట‌లు ప‌రిచిన సామాజిక వ‌ర్గాల నాయ‌కుల‌కు క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇచ్చే తీరిక‌లో మంత్రి లేరని కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆనాడు.. ఏ సామాజిక వ‌ర్గాలైతే.. మంత్రి ఎదుగుద‌ల‌కు కృషి చేశాయో.. ఇప్పుడు అవే సామాజిక వ‌ర్గాల నాయ‌కులు.. మంత్రికి వ్య‌తిరేకంగా.. మాట్లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇంకెవరికి టికెట్ ఇచ్చినా.. ఫ‌ర్వాలేదు..కానీ, మంత్రి సీదిరికి మాత్రం మ‌రోసారి టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామంటూ బ‌హిరంగంగానే వారు త‌మ అస‌హ‌న‌, అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామం.. ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌నంగా మారింది. మ‌రి మంత్రి ఈ ప‌రిస్తితిని చ‌క్క‌దిద్దుకుంటారో.. లేక కోరిక‌ష్టాల పాల‌వుతారో చూడాలి.