ఆ విషయంలో తమ హీరోలదే పైచేయి అంటున్న నందమూరి అభిమానులు..!

ఎంత అవునన్నా కాదన్నా సినీ హీరో అభిమానుల మధ్య ఎప్పుడూ క్లాష్ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తెలుగులో ఒక రకమైన పోటీ ఉంది. కాలం గడిచే కొద్దీ ఆ పోటీ అభిమానుల మధ్య ఘర్షణల వరకు వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ సినిమాల విషయంలో అభిమానులు ఇప్పటికీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటుంటారు. ఇలాంటి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కనిపిస్తాయి. అయితే తెలుగులో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఎవరి సినిమా అయినా హిట్ అయితే, లేకుంటే ఫ్లాప్ అయితే ట్రోలింగ్ మామూలుగా ఉండడం లేదు. ఇక కోవిడ్ వచ్చాక ఇండస్ట్రీ కొంచెం బలహీన పడింది. ఎవరి సినిమా విడుదలైనా సరైన ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. అంతేకాకుండా ఓటీటీ బాగా పాపులర్ అయిన తర్వాత ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడం మానేశారు. ఇలాంటి సమయంలో వరుస హిట్లతో బాక్సాఫీసును కళకళలాడేలా నందమూరి హీరోలు చేశారు.

తెలుగులో ఇటీవల కాలంలో నందమూరి హీరోలు చేసిన సినిమాలు బాగా కలెక్షన్లు సాధించాయి. కోవిడ్ కష్ట కాలంలో థియేటర్లు, సినిమా టికెట్లపై ఆంక్షలు ఉన్నా, బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఘన విజయం సాధించింది. ఇక జూ.ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ కూడా భారీ విజయం సొంతం చేసుకుంది. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార చిత్రం కూడా సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో నందమూరి హీరోలు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో మరో పేరొందిన మెగా ఫ్యామిలీ నుంచి కూడా సినిమాలు వచ్చాయి. చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, బీమ్లానాయక్ సినిమాలు హిట్ టాక్ వచ్చినా, వసూళ్లు ఆశించినంత రాలేదు. వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 పర్వాలేదనిపించినా, గని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన హిట్ అయినా, కొండపొలం సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ హీరోల సినిమాలు కూడా కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు చవి చూశాయి. కోవడ్ వచ్చాక నందమూరి హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో నందమూరి అభిమానుల హంగామా మామూలుగా లేదు. అందరిపై నందమూరి హీరోలు పైచేయి సాధించారని కామెంట్లు పెడుతున్నారు.