బాబు ఎఫెక్ట్: రేవంత్‌కు రిస్క్?

తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడో వైదొలగిన విషయం తెలిసిందే..2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడం మానేశారు. అలాగే ఏపీలో కూడా ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితం కావడంతో..పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టి…బాబు పనిచేస్తున్నారు. అసలు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు.

అయితే బాబు తెలంగాణ జోలికి వెళ్లకపోయినా సరే…ఏదొక సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బాబు పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని పదే పదే ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని చంపేసి…రేవంత్ రూపంలో బాబు రాజకీయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డికి పి‌సి‌సి పదవి ఇప్పించిందే చంద్రబాబు అని అటు టీఆర్ఎస్ నేతలు..ఇటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించారు.

ఈ మధ్య కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతూ…రేవంత్ వెనుక బాబు ఉన్నారని, ఆంధ్రా పెట్టుబడిదారుల కనుసన్నల్లో రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ విధంగా చంద్రబాబు పేరు ఏదొక విధంగా తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తూనే ఉంది. ఇలా బాబు పేరు వల్ల రేవంత్ రెడ్డికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు కూడా వస్తున్నాయి.

అదే సమయంలో బాబు వల్ల మరొక విధంగా కూడా రేవంత్ రెడ్డికి నష్టం జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దాటుకుని టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి మరింత ఊపు వచ్చేలా..చంద్రబాబు…కేంద్రంలోని పెద్దలకు దగ్గర కావడం రేవంత్ కు మైనస్ అని చెప్పొచ్చు.

తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ వాళ్ళల్లో తెలుగుదేశం అభిమానులు ఎక్కువగానే ఉన్నారు…వారు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు బాబు…బీజేపీకి దగ్గరవుతున్న నేపథ్యంలో…సెటిలర్లు బీజేపీ వైపుకు వెళ్ళే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి కాస్తో కూస్తో బలం ఉంది. ఇప్పుడు ఆ బలం బీజేపీకి ప్లస్ కావొచ్చు. ఏదేమైనా గాని బాబు వల్ల రేవంత్ రెడ్డికి రిస్క్ ఎక్కువగానే ఉంది.