అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. అందులో ధోనిని మించిపోయిందిగా ..!?

గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్‌వెల్త్ క్రికెట్ టోర్నమెంట్‌ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో పాక్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్‌ప్రీత్ పొట్టి ఫార్మాట్‌లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును ఆమె బద్దలు కొట్టింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

భారత్‌కు సారథ్యం వహించిన వారిలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్నో మ్యాచ్‌లను తన నిర్ణయాలపై విజయతీరాలకు ధోని చేర్చాడు. ముఖ్యంగా దేశానికి టీ20, వన్డే వరల్డ్ కప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు. గొప్ప కెప్టెన్లలో ఒకరిగా ప్రశంసించబడిన ధోని సారథ్యంలో భారత జట్టు, 41 టీ20లలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ రికార్డును భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరగరాసింది.

టీ20లలో 42 విజయాలతో ధోని రికార్డును ఆమె అధిగమించింది. ధోనీ 72 టీ20 మ్యాచ్‌ల్లో 41 విజయాలు సాధించాడు. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ 71 మ్యాచ్‌లలోనే 42 విజయాలతో ధోనిని మించిపోయింది. కొన్నాళ్లుగా భారత మహిళల జట్టు చక్కటి ఆటతీరు కనబరుస్తోంది. అయితే హర్మన్ ప్రీత్ వ్యక్తిగత ఆటతీరుతో ఎన్నో విజయాలు భారత్‌కు చేకూరాయి. బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ హర్మన్ ప్రీత్ తనదైన ముద్ర వేస్తోంది. సుదీర్ఘ కెరీర్‌కు మిథాలీ రాజ్ వీడ్కోలు పలికిన తర్వాత భారత జట్టు సారథ్య బాధ్యతలను సమర్థంగా ఆమె నిర్వహిస్తోంది.

Share post:

Latest