అల్లు – మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ నిజమేనా? అసలేం జరుగుతోంది?

గత కొన్నాళ్లుగా మెగా – అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలు, వివాదాలు, కోల్డ్ వార్ అంటూ ఇలా ఏవేవో గుసగుసలు టాలీవుడ్లో వినబడుతున్నాయి. సదరు వ్యక్తులు మేము బాగానే వున్నాం మొర్రో అని మొత్తుకున్నా ఇలాంటివి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇపుడు ఈ విషయంపైన మనం ఓ లుక్కేద్దాం. అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో మెగా ఫామిలీ జపం చేసిన విషయం మెగాభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. అయితే అల్లు అర్జున్ రేంజ్ రానురాను పెరుగుతున్న క్రమంలో మెగా ఫామిలీ పేరునే మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఓ వర్గం నిందిస్తోంది.

ఇక నిజానిజాల్లోకి వెళితే… జరిగిన గత సంఘటనలు ఓసారి చూస్తే.. అల్లు అర్జున్ గత సినిమాల ఆడియో ఫంక్షన్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుకి అల్లు అర్జున్ ఒకింత అసహనానికి గురైన విషయం విదితమే. ఇదిగో ఇక్కడే వచ్చింది అసలు సమస్య. దాన్ని అదనుగా తీసుకొని కొన్ని మీడియా సంస్థలు తమకు నచ్చినట్టు ఏవేవో రాసి పారేశాయి. దాంతో మెగా – అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ అనేది నడుస్తుందని పుట్టుకొచ్చింది. అయితే ఇందులో నిజం మాట దేవుడికెరుకగాని… ఆ విషయం చెప్పి చెప్పి అది నిజమేనేమో అని భ్రమ కలిగేలా చేసారు.

ఇకపోతే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి పట్ల చూపిస్తున్న అభిమానం అందరికీ తెలిసినదే. సందర్భానుసారంగా బన్నీ మెగాస్టార్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటాడు. అలాగే పవర్ స్టార్ అన్నా కూడా అదేవిధమైన విధేయతని చూపిస్తాడు బన్నీ. వారి మధ్య వైరానికి తావేలేదు. ఓ రకంగా అల్లు అర్జున్ వారికి బిడ్డలాంటివాడు. వారు కూడా అంతే ప్రేమను బన్నీపైన కురిపిస్తారు. ప్రతిసారి ఈ విషయాన్ని రుజువు చేయనవసరం లేదు. కాబట్టి ఇలాంటి అపోహలను ఇకనుండైనా అవాయిడ్ చేయండి.

Share post:

Latest