టీడీపీలో ఖాళీలు..అభ్యర్ధులు దొరకడం లేదా?

గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పుడుప్పుడే నిదానంగా కోలుకుంటుందని చెప్పొచ్చు…దాదాపు రెండేళ్ల పాటు టీడీపీలో చలనం లేదు…కానీ ఇటీవల పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత కష్టపడిన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో పికప్ అవ్వడం లేదు. అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు కూడా పార్టీకి లేరు.

వచ్చే ఎన్నికల్లో జగన్ కు చెక్ పెట్టాలంటే ప్రతిచోటా టీడీపీకి బలమైన నాయకులు ఉండాలి.. కానీ టీడీపీకి ఆ స్థాయిలో బలమైన నేతలు లేరు. అసలు కొన్ని చోట్ల నాయకులే లేరు. పార్టీ సత్తా చాటాలంటే అసెంబ్లీ స్థానాలు ఎంత ముఖ్యమో,  పార్లమెంట్ స్థానాలు కూడా అంతే ముఖ్యం. పార్లమెంట్ స్థానాల్లో ఉండే బలమైన అభ్యర్ధులు ప్రభావం వల్ల…అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగు అవుతాయి. అసలు పార్లమెంట్ లోనే బలమైన నేతలు లేకపోతే అసెంబ్లీ స్థానాల్లో రిస్క్ ఉంటుంది.

వాస్తవానికి గత ఎన్నికల తర్వాత చాలా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి నాయకులు లేకుండా పోయారు. ఎలాగో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్ లని పక్కన పెడితే…మిగిలిన 22 స్థానాల్లో కొన్ని చోట్ల టీడీపీకి నాయకులు లేరు. కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి అభ్యర్ధులు లేరు. అలాగే నరసాపురం, ఏలూరు పార్లమెంట్ స్థానాల పరిస్తితి కూడా అంతే.

ఇక బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కడప స్థానాల్లో కూడా నాయకులు లేరు. ఏదో ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు అభ్యర్ధులని పెట్టొచ్చు గాని…దాని వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే ఎన్నికలనాటికి బలపడతారు. కాబట్టి టీడీపీలో ఖాళీలని ఎంత త్వరగా భర్తీ చేస్తే అంత మంచిది..లేదంటే టీడీపీ గతి అధోగతే.