కేశినేని ఫ్యామిలీలో చిచ్చు….ఎవరి పని?

ఇప్పటివరకు తన అన్న కేశినేని నానికి అండగా నిలిచిన కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని..ఈ మధ్య కాలంలో సెపరేట్ గా రాజకీయం నడపటం మొదలుపెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నానికి సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా చేసుకుంటూ వెళుతున్నారు. అయితే నాని…అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని ఎప్పటినుంచో కథనాలు కూడా వస్తున్నాయి…అలాగే సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలో నెక్స్ట్ కేశినేని నానిని సైడ్ చేసి…ఆయన సోదరుడు చిన్నికి విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది…ఇక దీనిపై నాని ఘాటుగానే స్పందిస్తూ…తన శత్రువుని ప్రోత్సహిస్తే…మీ శత్రువుని ప్రోత్సహిస్తా అనే విధంగా నాని…టీడీపీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చారు. అలాగే తన వి‌ఐ‌పి స్టిక్కర్ ని నకిలీ చేసి…కొందరు హడావిడి చేస్తున్నారని చెప్పి…ఒక కారుపై కంప్లైంట్ ఇచ్చారు…తీరా ఆ కారు వచ్చి నాని సోదరుడు చిన్నిది. ఇలా కేశినేని ఫ్యామిలీలో చిచ్చు రేగింది.

అయితే వెంటనే చిన్ని దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.. ఆ స్టిక్కర్ ఎవరిదో.. ఏంటో.. విచారణలో తేలుతుందని, హైదరాబాద్‌లో పోలీసులు విచారణ జరిపారని, తన కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని, తనపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహారమేనని, రాజకీయపరమైనది కాదని చిన్ని క్లారిటీ ఇచ్చారు. తాను చేసే ప్రతి చిన్న కార్యక్రమాన్ని సైతం వివాదాల్లోకి లాగారని, టీడీపీలో తానొక సాధారణ కార్యకర్తనని, చంద్రబాబు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమని, ఎన్నికల్లో పోటీకి టికెట్ కూడా అడగలేదని అన్నారు.

అలాగే పార్టీ ఆదేశిస్తే.. తన అన్న కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి కేశినేని ఫ్యామిలీలో ఎవరో వివాదం సృష్టించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కేశినేనికి వ్యతిరేకంగా ఉండే గ్రూపులే ఈ పని చేస్తున్నాయని కేశినేని అనుచరులు అనుమానిస్తున్నారు. మొత్తానికైతే కేశినేని ఫ్యామిలీలో రగిలిన చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.