ఎఫ్ 3 :మూవీ రివ్యూ … అనిల్ రావిపూడి మ్యాజిక్ మిస్ అయింది ?

మూవీ పేరు : ఎఫ్ 3

విడుదల: 27 మే 2022

నటీనటులు: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్ తదితరులు

డైరెక్టర్: అనిల్ రావిపూడి

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాత: దిల్ రాజు – శిరీష్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటర్: తమ్మిరాజు

గతంలో అనిల్ రావిపూడి నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా కామెడీ ట్రాక్ ఉన్నవే కావడం విశేషం. అయితే ఎఫ్ 2 మాత్రం పూర్తిగా నవ్వులమయమే. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. తద్వారా ఎఫ్ 2 సూపర్ హిట్ అయింది. అప్పుడే డైరెక్టర్ అనిల్ మనసులో మరొక ఆలోచన వచ్చింది. దీనికి సీక్వెల్ ఎందుకు తీయకూడదు అని… అలా ఎఫ్ 3 మూవీకి బీజం పడింది. మరి ఎన్నో అంచనాలతో వచ్చిన ఎఫ్ 3 ఎంతవరకు ఆకట్టుకుంది అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ: ఇందులో ప్రధాన పాత్రలు అయిన వెంకీ (వెంకటేష్) మరియు వరుణ్ (వరుణ్ తేజ్) లు ఇద్దరికీ డబ్బు అంటే మహా ఇష్టం. అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందులో భాగంగా కొన్ని ప్రయోగాలు చేసి అందులో ఫెయిల్ అవుతారు. వీరు ఇలా అష్టకష్టాలు పడుతూ ఉంటే వెంకీ భార్య హారిక (తమన్నా) కుటుంబం వీరిని డబ్బు సంపాదించకుండా మోసం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే… విజయనగరానికి చెందిన బిజినెస్ మ్యాన్ (మురళీ శర్మ) ఎప్పుడూ కనబడకుండా పోయిన కొడుకు కోసం వెతికే పనిలో ఉంటాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న వెంకీ, వరుణ్, తమన్నా లు ఎలాగైనా ఆ ఇంట్లోకి తప్పి పోయిన కొడుకుగా నమ్మించి ఆస్తిని కాజేయాలని పథకం వేస్తారు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది ? మురళి శర్మ ను వీరు కొడుకని నమ్మించగలిగారా ? లేదా అతని చేతిలో మోసగాళ్లు గా చిక్కిపోయారా? అసలు మురళి శర్మ కొడుకు ఎవరు ? వెంకీ వరుణ్ లైఫ్ ఎలా మారుతుంది ? ఇలా ఎన్నో ప్రశ్నలతో సినిమా సాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : సినిమాలో కామెడీకి ఎటువంటి ఢోకా లేదు. ముందు నుండి చిత్ర బృందం చెబుతున్నట్లుగానే మంచి వినోదాన్ని పంచారు. ఎప్పటిలాగే వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. వెంకీ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ అవుతారు. ఎఫ్ 2 లో కన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమాలో నటించాడు వెంకీ. వెంకటేష్ నటించిన సీన్స్ అన్నీ హైలైట్ గా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సన్నివేశాలు, డబ్బు కోసం పడే ఫ్రస్టేషన్ సన్నివేశాలు, ఇక వరుణ్ తో ఉండే సన్నివేశాలలో అయితే వెంకీ నటన సూపర్బ్ అంతే. వరుణ్ తేజ్ నటనలో బాగా డెవలప్ అయ్యాడు. కామెడీని పండించడంలోనూ ఒక మెట్టు ఎక్కాడని చెప్పాలి. ఎఫ్ 2 సినిమాలో లాగే ఇందులోనూ తమన్నా ఫ్యామిలీ తో కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే పాత్రలలో వారి ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించింది. ఇక వీరిద్దరి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మూడవ హీరోయిన్ గా తీసుకున్న సోనాలి చౌహన్ కూడా పర్వాలేదనిపించింది. ఇక చూడడానికి పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. టాలీవుడ్ చార్లీ చాప్లిన్ రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. తనకు ఇచ్చిన పాత్రలో చక్కగా ఒదిగిపోయి నవ్వులను పూయించాడు. మిగిలిన పాత్రలలో నటించిన వారంతా దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టారు.

మైన్స్ పాయింట్స్ : దర్శకుడు అనిల్ రావిపూడి ఓవరాల్ గా సినిమా కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ బలమైన కథ లేకపోవడం కాస్త నిరాశపరిచిన అంశం అని చెప్పాలి. ఇందులో నడిపించిన కథలో లాజిక్ లేకుండా ముగించిన తీరు కొందరిని ఆకట్టుకోలేదు అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే పరిధి ఉన్నా ఎందుకో కట్ చేసినట్లుగా అనిపించాయి. కామెడీని ఎంత స్థాయికి అయినా తీసుకెళ్లి పండించవచ్చు. కానీ మొదటిసారి అనిల్ రావిపూడి మొదటిసారి తన కామెడీకి హద్దులు పెట్టుకున్నాడు. సినిమాలో ఎమోషన్స్ ను సరిగా పండించలేకపోయాడు. ఇక సినిమా అంతా డిపెండ్ అయిన మురళీశర్మ మరియు కొడుకు ట్రాక్ సరిగా డీల్ చేయలేకపోయాడు. మొదటి అర్ధభాగం మాత్రం మంచి కామెడీతో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. కానీ రెండవ అర్ధభాగం లో మాత్రం కామెడీని రన్ చేయడంలో డైరెక్టర్ తడబడ్డాడు. అక్కడక్కడ బోరింగ్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం: డైరెక్టర్ గా అనిల్ రావిపూడి అటు దర్శకుడిగా మరియు రచయితగా ఒక మంచి సినిమాను ఇవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రం తెరపై కనిపించింది. అయితే కథనాన్ని కొనసాగించడంలో పొరపాట్లు జరిగాయి. ఇక్కడ జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా సంతృప్తికరంగా ఉండేది సినిమా. సంగీతంలో డిఎస్పీ ఇరగదీశాడు. సినిమాటోగ్రపీ సమీర్ రెడ్డి కెమెరా వర్క్ అద్భుతంగా అనిపించింది. ప్రతి సీన్ ను అందంగా చూపించాలి అన్న తన కసి కనిపించింది. ఎడిటర్ తమ్మిరాజు సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ను కట్ చేయకుండా వదిలేశాడు. ఇక నిర్మాత దిల్ రాజ్ గురించి తెలిసిందే మంచి సినిమాగా రావడానికి ఎంత డబ్బు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు.

తీర్పు: సినిమాలో కామెడీ ఉంది… కామెడీ మాత్రమే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ మరియు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా సినిమా అంత నవ్వులు ఉన్నాయి. అయితే ఒక సినిమాకు కావాల్సిన బలం మంచి కథ… దానిని కొనసాగించే అద్బుతమయిన కథనం సరిగా ఉండాలి. ఇక్కడ అనిల్ రావిపూడి ఫెయిల్ అయ్యాడు. లాజిక్ లేని ఎన్నో సీన్ లు ప్రేక్షకుడికి పరీక్ష పెడుతాయి. ఇక ప్రధానమైన కొన్ని సీన్స్ కూడా ఆకట్టుకోలేదు. అయితే వెంకీ మరియు వరుణ్ తేజ్ లు తమ కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ లతో కాస్త సినిమాను బ్రతికించారు. ఈ సినిమా కేవలం ఫ్యామిలీ మరియు కామెడీ నచ్చే వారికి మాత్రమే.

రేటింగ్ : 2.75

Share post:

Latest