ఆచార్య.. ఎక్కడో చూసినట్లు ఉందిగా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో నింపేశాడు కొరటాల.

ఒక ఊరు.. అందులో సిద్ధ అనే వ్యక్తి అందరికీ అండగా ఉంటాడు.. అయితే కొన్ని కారణాల వల్ల సిద్ధ ఆ ఊరికి దూరం అవుతాడు.. ఆ ఊరిని దుర్మార్గుల బారి నుండి కాపాడేందుకు ఆచార్య రంగంలోకి దిగుతాడు.. అయితే సిద్ధతో అతడికి ఆల్రెడీ పరిచయం ఉంటుంది.. ఇది ఓవరాల్‌గా సినిమా కథ అని మనకు ట్రైలర్‌లోనే చెప్పేశారు చిత్ర యూనిట్. అయితే ఇదే తరహా కథను బాలయ్య ఎప్పుడో మనకు చూపించేశాడు.

ఒక కుటుంబంలోని అక్కచెల్లెళ్లు.. తమ అన్నయ్య కోసం నానా కష్టాలు పడుతూ..ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే వారిని ఆదుకునేందుకు వాళ్ల అన్నయ్యగా బాలయ్య ఎంట్రీ ఇస్తాడు.. ఇక్కడా ఆ ఆడపిల్లల అన్నయ్యతో బాలయ్యకు పరిచయం ఉంటుంది.. ఇదే బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా కథ. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాలోని కథను స్పూ్ర్తిగా తీసుకుని కొరటాల కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆచార్యగా మనకు చూపించబోతున్నాడా.. అంటే అవుననే అనాలి. ఏదేమైనా ఆచార్య చిత్ర ట్రైలర్ చూస్తుంటే బ్రహ్మానందం మీమ్ ఒకటి ఠక్కున గుర్తుకు వస్తోంది.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందండీ…అంటూ పక్కున నవ్వేస్తాడు. ఇప్పుడు ఆచార్య ట్రైలర్ పరిస్థితి కూడా అలాగే ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.