కన్నడలో గందరగోళంగా మారిన ఆర్ఆర్ఆర్ రిలీజ్..?

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం దేశవ్యప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి కర్ణాటకలో అయోమయం పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

కన్నడలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు అక్కడి ఎగ్జిబిటర్లు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు ‘జేమ్స్’ చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం కావడంతో జేమ్స్ చిత్రం కన్నడనాట భారీ వసూళ్లు రాబడుతోంది. ఇలాంటి తరుణంలో ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రం రిలీజ్ అయితే అక్కడ జేమ్స్ చిత్రంపై ప్రభావం చూపిస్తుందని, అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్‌ను తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలని, లేదా కన్నడనాట ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలనే టాక్ బలంగా వినిపిస్తోందట.

దీంతో అప్రమత్తమైన ఆర్ఆర్ఆర్ కర్ణాటక ఎగ్జిబిటర్లు జేమ్స్ చిత్ర యూనిట్, నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారట. వీలైనంత త్వరగా ఈ సమస్యకు ఓ పరిష్కారం వెతికే పనిలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఉన్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయం ముందు ఇలాంటి అడ్డంకులు రావడం నిజంగా విచారకరం అంటున్నారు ఆర్ఆర్ఆర్ అభిమానులు.

Share post:

Popular