జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వంతో టాలీవుడ్‌కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా అవేవి ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ త‌ర్వాత అయినా స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇంత‌లోనే ట్విస్ట్‌.. అది ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన భేటీ కాద‌ని.. వ్య‌క్తిగ‌త భేటీ అన్న ప్ర‌చారం వైసీపీతో పాటు ఇటు మా అధ్య‌క్షుడి నుంచి మొద‌లైంది.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 10న మ‌రోసారి సినిమా పెద్ద‌లు ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అవుతున్నారు. ఈ భేటీ అంతా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతోంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటార‌న్న ప్ర‌చారం ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో జ‌రుగుతోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌కూడ‌ద‌న్న ప‌రిస్థితేమీ లేదు. పైగా ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలోనే ఉన్నారు.

ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున‌, మ‌హేష్‌బాబుతో పాటు నిర్మాత‌లు వంశీ, దాన‌య్య‌, దిల్ రాజు కూడా పాల్గొంటార‌ని అంటున్నారు. వీరితో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీలో సినిమా టిక్కెట్లపై ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక కూడా రెడీ అయ్యింది. ఈనివేదిక ఇప్ప‌టికే జ‌గ‌న్ చెంత‌నే ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను క‌లిసి ఇండ‌స్ట్రీ ఇబ్బందులు చెప్పుకునే విష‌య‌మై చిరంజీవి సినీ ప్ర‌ముఖులు అంద‌రితోనూ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఓ వైపు టీడీపీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాల‌ని డిమాండ్లు వ‌స్తోన్న నేప‌థ్యంలో.. ఇప్పుడు అదే జూనియ‌ర్ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అవుతారు అన్న వార్తే అటు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు ఇటు సినిమా స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి జూనియ‌ర్ ఈ భేటీకి వెళ‌తారా ? లేదా ? అన్న‌ది చూడాలి.


Leave a Reply

*