జగ్గారెడ్డికి పొగ పెడుతున్నారా?

టి.కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉండి.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది. మీరే ఇలా ప్రవర్తిస్తే .. ఇక సామాన్య కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ వెళుతుందని పేర్కొంటున్నారు. అసలు విషయమేంటంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల సీఎం దత్తత గ్రామమైన ఎరవల్లిలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో బయలు దేరారు. అయితే ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంది.

ఈ విషయం పక్కనపెడితే అసలు రేవంత్ రెడ్డి తమను సంప్రదించకుండా, కనీసం చర్చించకుండా కార్యక్రమాన్ని ఎలా డిసైడ్ చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆయనను టీపీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అంతటితో ఊరుకోకుండా నేరుగా మీడియాకు ఆ విషయం చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తరువాత చాలా రోజుల పాటు మౌనంగా ఉన్న జగ్గారెడ్డి వాయిస్ పెంచారు. మీడియాతో రేవంత్ పై అక్కసు వెళ్లగక్కారు.

జగ్గారెడ్డి చేసిన ఈ నిర్వాకానికి పార్టీ అధిష్టానానికి చిర్రెత్తుకొచ్చింది. పార్టీలో ఏమైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ ఇలా బహిరంగంగా కామెంట్ చేయడం ఏమిటని, అయినా మీరు రాసిన లేఖను మీడియాకు ఎందుకు లీక్ చేశారని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ జి.చిన్నారెడ్డి జగ్గారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ తతంగానికి సబంధించి ఓ నివేదికను అధిష్టానానికి పంపుతామని చిన్నారెడ్డి పేర్కొన్నారు.త్వరలో జగ్గారెడ్డిని పిలిచి లేఖ లీక్ ఎలా అయిందో వివరణ కోరతామని వివరించారు. దీనిని బట్టి చూస్తే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పొగపెడుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest