కారులో ఎన్టీఆర్.. ఎదురుగా పెద్దపులి.. ఏం జరిగిందో తెలుసా?

పద్మనాభం.. ఒకప్పటి గొప్ప హాస్య నటుడు. అంతేకాదు.. అద్భుత దర్శకుడు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. రేఖా అండ్ ముర‌ళి కంబైన్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న నిర్మించిన తొలి సినిమా క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు.. దేవత. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ సినిమాను కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో క‌న్నుల్లో మిస‌మిస‌లు అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటను ఔట్ డోర్ లో షూట్ చేశారు. సాతనూరు ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. అయితే ఈ పాటను తీస్తున్న సమయంలో ఓ అనుకోని ఘటన జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈ పాట కోసం సావిత్రి ముందుగా లొకేషన్ కు వచ్చింది. రామారావును వెంట తీసుకుని పద్మనాభ కారులో రాత్రి 9 గంటలకు మద్రాసు నుంచి బయల్దేరాడు. . తిరువ‌ణ్ణామ‌లై నుంచి సాత‌నూరు వెళ్లాలి. కారు వెనుక సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చాక ఎన్టీఆర్ ను లేపాడు. ఆరు దిగి అటు ఇటు కలియతిరిగి మళ్లీ వెళ్దాం అన్నాడు ఎన్టీఆర్. అయితే మీరు పడుకున్న సమయంలో ఓ వింత జరిగిందని పద్మనాభం చెప్పాడు.

చెంగలపట్టు దగ్గరకు వస్తున్న సమయంలో ఓ పెద్దపులి మన కారుకు ఎదురైందని చెప్పాడు. అది గాండ్రిస్తూ వెళ్తున్నట్లు చెప్పాడు. బ్రేక్ వేసి ఆపితే మీరు లేస్తారని డ్రైవర్ వణికాడని చెప్పాడు. నేను పైకి మామూలుగా ఉన్నా లోపల వణుకు పుట్టిందని చెప్పాడు. అవునా పులి ఎదురు రావడం మంచి శకునం. నన్ను లేపితే నేనూ చూసేవాడిని కదా అన్నాడు ఎన్టీఆర్. మేం పులికి పెద్దగా భయపడలేదండీ.. మా వెనుక సింహం పడుకుని ఉంటే పులికి ఎలా భయపడతాం అని పద్మనాభం అనగానే ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత సాతనూరు వెళ్లి పాటను పూర్తి చేసుకుని వచ్చారు.