కలిసొచ్చేదెవరు? లీడ్ చేసేదెవరు..?

తెలుగు సినీ పరిశ్రమ ఇంతకుముందెప్పుడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తెరకెక్కించి తీరా బొమ్మ వేద్దామనే లోపే కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులు బాగానే ఉన్నా ఏపీలో మాత్రం బొమ్మకు గడ్డు రోజులు వచ్చి పడ్డాయి. థియేటర్లలో అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం మేల్కొంది. మీ ఇష్టానుసారం టికెట్ ధరలు వసూలు చేసేందుకు వీల్లేదు.. మేమే నిర్ణయిస్తామని రేట్లను సవరించింది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే టికెట్ ధరలు ఉండాలని సర్కారు స్పష్టం చేసింది. అంతేకాక మరో ముందడుగు వేసిన ప్రభుత్వం థియేటర్లలో సౌకర్యాలు, తినుబండరాల ధరలు చెక్ చేసింది. పర్మిషన్ కూడా పరిశీలించింది. రూల్స్ అతిక్రమించి నడుపుతున్న థియేటర్లున మూసివేసింది. ఒక రకంగా ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి అనుకూలంగా ఉన్నవే.

అందరూ సినిమా చూడవచ్చనేది సర్కారు ఉద్దేశం. అందుకే ప్రేక్షకులు గానీ, అభిమాన సంఘాలు గానీ, రాజకీయ పార్టీలు గానీ ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అయితే సినీ పరిశ్రమకు మాత్రం ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీస్తారు. సినిమా విడుదల ఆ తరువాత తక్కువ రేటుతో టికెట్ కొని బొమ్మ చూస్తే అలా ఎన్ని రోజులు కావాలి.. ఆ డబ్బు రావడానికి. అదీ అసలు సమస్య. దీంతో ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని సినీ పెద్దలు కోరుతున్నారు. కొందరు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి పెద్దన్నగా ఉండాలని కోరారు. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. మీకేమైనా సమస్య వస్తే చెప్పండి ఆదుకుంటా అని చెప్పారు. అంటే చిరంజీవి ఈ సమస్య మీద దాదాపు ఎవరినీ కలవకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే ఆయన ఏపీలోని మంత్రితో మాట్లాడి సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే ఇప్పటికీ అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ కాలేదు.

రంగంలోకి మోహన్ బాబు

సినిమా సమస్య రోజు రోజు కూ పెరుగుతుండటంతో రంగంలోకి మోహన్ బాబు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. అందరం కలిసి ఇద్దరు సీఎంల వద్దకు వెళ్లి మాట్లాడదాం.. సినిమా అంటే ఓ నాలుగు కుటుంబాలు..నలుగురు హీరోలు కాదు.. వేలమంది అని పరోక్షంగా పరిశ్రమలో రాజ్యమేలుతున్న వారిని విమర్శించారు. అయితే మోహన్ బాబు లేఖకు సినీ పెద్దల నుంచి ఇంకా స్పందన రాలేదు. ఈ ఇద్దరూ ఇలా అభిప్రాయపడితే మిగతా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్న బాలక్రిష్ణ కూడా ఏమీ మాట్లాడటం లేదు. చివరకు నాయకత్వం వహించేదెవరో అని పెద్దలు ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest