పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం..

(1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని డిమాండ్-సప్లయి అంటారా? బ్లాక్ మార్కెట్ అంటారా?

(2) సామాన్యుడి అభిమానాన్ని లూటీచేసే పరిస్థితి ఉండకూడదు.

ఈ రెండు విషయాలను చర్చిస్తే.. (1) పేర్ని నాని ఎన్నడూ బ్లాక్ మార్కెట్ లో టికెట్లు కొన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఎన్నడైనా ఆయన అలా కొని ఉంటే.. బ్లాక్ మార్కెట్ అంటే ఏమిటో ఆయనకు తెలిసి ఉండేది. వంద రూపాయల టికెట్ ను వెయ్యి రూపాయలకు అమ్ముకుంటే దానిని బ్లాక్ మార్కెట్ అంటారు. అంటే.. కౌంటర్లో వందరూపాయలకే అమ్మినట్టుగా రికార్డు అయి ఉంటుంది.. కానీ.. హాలు బయట దానిని వెయ్యికి అమ్ముకుంటారు. టికెట్ ధర మీద ప్రభుత్వానికి ముట్టే పన్నులు గట్రా కేవలం వంద రూపాయలకు సంబంధించి మాత్రమే వస్తాయి. అంటే.. టికెట్ అమ్మిన ధరలు 900 రూపాయల మేర పన్నులు కూడా చెల్లించకుండా లూటీ జరుగుతుందన్నమాట. అలా జరిగితే మాత్రమే దానిని బ్లాక్ మార్కెట్ అనాలి. వెయ్యి రూపాయలు పెడతారో.. రెండు వేల రూపాయలు పెడతారో తర్వాతి సంగతి. టికెట్ అమ్మిన పూర్తి మొత్తం మీద ప్రభుత్వానికి లెక్కలు చెప్పి పన్నులు కడితే అది బ్లాక్ మార్కెట్ ఎలా అవుతుంది?

అందుకే మంత్రి పేర్ని నానికి బ్లాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియనే తెలియదని అనుకోవాల్సి వస్తోంది.

రెండో విషయానికి వద్దాం. (2) సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి ఉండకూడదు అని అంటున్నారు. సినిమా వాళ్లంతా కలిసి మేమేమీ బలవంతంగా మొదటిరోజే వచ్చి సినిమా చూడాలని ఒత్తిడి చేయడం లేదు కదా.. మరిక లూటీ ప్రస్తావన ఎక్కడుంది? అని అడుగుతున్నారు. ఆ రేటు భరించలేని పేద ప్రేక్షకుడు రెండో వారం థియేటర్ కు వస్తే.. మామూలు ధరకే చూసుకోవచ్చు కదా.. అనేది పరిశ్రమ వాదన.

కానీ ఇక్కడ ఇంకో వాదన వినిపించాలి. ఇటీవల జరిగిన కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వారు ఓటుకు పదివేల రూపాయల వంతున పంచిపెట్టారని బాగా వినిపించింది. అయితే ప్రతి ఓటుకూ కాదు. కీలకమైన.. గట్టిపోటీ ఉన్న కొన్ని వార్డుల్లో.. తెలుగుదేశానికి పడతాయిన అనుమానం ఉన్న కొన్ని ఓట్లకు మాత్రమే పదివేల రూపాయల వంతున ధర కట్టి ఓట్లు వేయించుకున్నారనేది స్థానికంగా జరిగిన ప్రచారం. తతిమ్మా అన్ని వార్డుల్లో.. అంటే పెద్ద పోటీ లేకుండా నెగ్గుతాం అనే నమ్మకం ఉన్న చోట సాధారణంగా ఓటుకు వెయ్యి రెండు వేలు మాత్రమే పంచారు. అలాగే.. ఎటూ వైసీపీకే పడతాయని అనిపించే ఓట్లున్న వారికి అందరికీ.. తక్కువ మొత్తాలే ఇచ్చారు.

దీని ద్వారా తేలుతున్నది ఏంటంటే.. సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేయడం అంటే అచ్చంగా ఇదీ! రాజకీయ పార్టీలు పేదల అభిమానాన్ని లూటీ చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు తమను అభిమానించే ఓటర్లకు తక్కువ డబ్బులు ఇస్తూ.. తమ వ్యతిరేక వర్గాలకు చెందిన వారి ఓట్ల కోసం ఎక్కువ డబ్బులు పంచి పెడుతున్నాయి. దీనిని లూటీ అంటారా? ఒక వారం ఆగితే మామూలు ధరకే సినిమా చూసుకోవచ్చు బాబూ.. తొలివారం డబ్బు పెట్టగలిగిన వారు మాత్రమే సినిమాకు రండి అని చెప్పి టికెట్లు అమ్ముకోవడాన్ని లూటీ అంటారా? సామాన్యుడి అభిమానాన్ని లూటీ చేయడం అంటే ఏమిటి? ఈ విషయంలో కూడా పేర్నినానికి క్లారిటీ ఉన్నట్టు లేదు.