టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. నిన్న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా `పుష్ప` ప్రీ రిలీజ్‌ను ఈవెంట్‌ను నిర్వహించారు. అభిమానుల కోలాహలాల మధ్య ప్రీ రిలీజ్ వేడుక సందడిగా జరిగింది.
ఈ ఈవెంట్‌కి దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు. అయితే మెయిన్ దర్శకుడు సుకుమార్ మాత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డుమ్మా కొట్టారు. దీంతో ఎంతో ముఖ్యమైన ఈవెంట్‌కు సుకుమార్ ఎందుకు రాలేదనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల.. దాన్ని పూర్తి చేయడానికి సుకుమార్ ముంబయి వెళ్లారట.
అందుకే, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయారట. ఏదేమైనా నిన్న జరిగిన ఈవెంట్లో దర్శకుడు లేని లోటు బాగా తెలిసింది. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో కలిపి 3000 స్క్రీన్లకుపైగా విడుదల చేస్తున్నారు. వీటిలో తెలుగు థియేటర్లలో సుమారు 1000కి పైగా ఉన్నాయని సమాచారం.