`వాయిస్ ఆఫ్ రవన్న`.. విరాట పర్వంపై అంచ‌నాలు పెంచేసిన రానా!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `విరాట ప‌ర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

- Advertisement -

1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి కామ్రేడ్ భారతక్క అనే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైంది. అయితే నేడు రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి `ది వాయిస్ ఆఫ్ రవన్న` పేరుతో ఓ స్పెష‌ల్ వీడియోను వ‌దిలారు.

`మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే..రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. ఛ‌లో.. ఛ‌లో.. ఛ‌లో పరిగెత్తు. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు. ఛ‌లో.. ఛ‌లో పరిగెత్తు… చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం… ఛ‌లో… ఛ‌లోపరిగెత్తు… ఒంగిన వీపుల బరువును దించి విప్లవ గీతం వినిపిద్దాం.. ఛ‌లో.. ఛ‌లో పరిగెత్తు.. దొరల తలుపుల తాళంలా… గడీల ముంగట కుక్కల్లా… ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. ఛ‌లో పరిగెత్తు.. ఛ‌లోపరిగెత్తు..` అంటూ రానా వాయిస్ సాగిన విప్ల‌వ గీతం సినిమా మీద అంచనాలను అంతకంతకూ పెంచేసింది.

మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. నివేదా పెతురాజ్, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్ త‌దిత‌రులు ఈ మూవీలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

Share post:

Popular