మంత్రి మల్లారెడ్డి అంటే అంతే..

విద్యాసంస్థల అధినేత, మంత్రి మల్లారెడ్డి అంటే అంతే.. ఆయన రూటే సపరేటు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే.. ఇపుడు ఆయన వ్యవహార శైలి మాత్రం మేడ్చల్ జిల్లాలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భూ సమస్యలు, భూ కబ్జాలను ప్రోత్సహించడం, రియల్ వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం లాంటివి చేస్తున్నాడని పార్టీలోని పలువురు నాయకులు పార్టీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే ఇంత జరుగుతున్నా తనకు కేసీఆర్, కేటీఆర్ తనకు బాగా క్లోజ్ కాబట్టే నేనేం చేసినా చెల్లబాటవుతుందనే సంకేతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపుతున్నాడని అందుకే ఆయన గురించి ఏమీ పట్టించుకోవడం లేదని పలువురు కార్యకర్తలు తమలో తాము అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రతి సంవత్సరం పార్టీకి కోట్ల రూపాయలు విరాళం ఇస్తుండటం కూడా మల్లారెడ్డికి కలిసొచ్చే అంశమని, అందుకే ఆయన మంత్రి పదవిలో కొనసాగుతున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సొంత జిల్లా నాయకులే ఇటీవల మల్లారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఆయన గ్రూపులను ప్రోత్సహించి విభజించు..పాలించు అన్న విధంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇది పార్టీకి నష్టం చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ బలహీనంగా మారే పరిస్తితులు నెలకొన్నాయి. ఇక కీసర నాయకులు మరో ముందుడగు వేసి మల్లారెడ్డి చర్యలను అడ్డుకోకపోతే తాము రాజీనామాలు చేయాల్సి వస్తుందని అధిష్టానంతో పేర్కొన్నట్లు తెలిసింది. ఆయనకు చెక్ పెట్టకపోతే పార్టీకి జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుందని, దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లాభం చేకూరుతుందని గట్టిగానే చెప్పారట. పరిస్తితి ఇలాగే కొనసాగితే కొందరు ముఖ్య నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలు బీజేపీ, హస్తం పార్టీల వైపు వెళ్లే ప్రమాదాలు కూడా ఉన్నాయని, ఇప్పటికైనా మేల్కొని మల్లారెడ్డికి చెక్ పెట్టాలని కోరుతున్నారట. మరి కేసీఆర్, కేటీఆర్ మేడ్చల్ జిల్లా నాయకుల మాటలు విని మంత్రిని అదుపు చేస్తారో, లేదో చూడాలి.