ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన దేశంలో ఇటీవల బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ రకం వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఏ దేశంలో కూడా ఈ వేరియంట్ వల్ల మరణం సంభవించినట్లు ఇంతవరకూ సమాచారం అందలేదని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచంలోని దేశాలన్నీ వైరస్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. చాలా దేశాల్లో లాక్ డౌన్ కూడా అప్పుడే ప్రకటించారు. జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆయా దేశాలు వివిధ రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే కొత్త వేరియంట్ నిరోధానికి బూస్టర్ డోస్ వేసేందుకు చాలా దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికా తోపాటు నమీబియా, బొట్స్వనా, కెనడా జింబాబ్వే, హాంకాంగ్, సౌదీ, యూఎస్ఏ, జపాన్, దక్షిణ కొరియా, పాకిస్తాన్, చెక్ రిపబ్లిక్, యూకే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, గ్రీస్ దేశాల్లో నమోదు అవుతున్నాయి.