`ఆర్ఆర్ఆర్‌`లో ఆ విష‌యాన్ని లీక్ చేసేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన తాజాగా మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో ఈ మూవీని రూపొందించారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రామ్ చ‌ర‌ణ్ `ఆర్ఆర్ఆర్‌`లో త‌న లుక్స్‌కు సంబంధించి ఓ అదిరిపోయే మ్యాట‌ర్‌ను లీక్ చేశారు.

ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను మూడు లుక్స్‌లో కనిపిస్తానని వెల్లడించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` కథ ప్రకారం నాకు మూడు విభిన్న పాత్రలు మరియు మూడు విభిన్నమైన లుక్‌లు ఉంటాయ‌ని తెలిపిన చ‌ర‌ణ్‌.. క్యారెక్టరైజేషన్‌లో మూడూ వేరు వేరుగా ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్‌లో చ‌ర‌ణ్ మూడు లుక్స్‌ను చూసేందుకు మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్‌లో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండ‌గా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అజయ్ దేవగన్, శ్రియ‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.