అదిరిపోయిన `రాధేశ్యామ్` ట్రైల‌ర్‌.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలు తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. 1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే వింటేజ్‌ ప్రేమకథా చిత్ర‌మిది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న రామోజీ ఫిలింసిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించిన మేక‌ర్స్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ చేత రాధేశ్యామ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు. `అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు` అని ప్ర‌భాస్ చెప్పడంలో ప్రారంభ‌మైన ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

మొద‌ట అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి పుజా హెగ్డే (ప్రేరణ) రావ‌డం.. ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం ట్రైల‌ర్‌లో చూపించారు. మ‌రోవైపు ప్రపంచం మొత్తం కలవాలనుకునే హస్తసాముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌ను కృష్ణంరాజు పరిచయం చేస్తారు. అదే సమయంలో ఈ విష‌యం తెలుసుకున్న ప్రేర‌ణ‌..`ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంత చదవ గలవో చూస్తాను’ అంటూ తన చేయి అందించింది.

దీనికి `కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం` అని ప్రభాస్ చెప్పడం సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అలాగే `విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?` అంటూ ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్ ట్రైల‌ర్‌కే హైలైట్‌గా నిలిచింది.

ట్రైన్ మరియు షిప్ మునిగిపోవడం, భూకంపం రావడం వంటి అంశాల‌ను కూడా ఇందులో చూపించారు. మ‌రి విధిని ఎదురించి విక్రమాదిత్య-ప్రేర‌ణ‌ల ప్రేమ ఎలా గెలుస్తుందో తెలియాలంటే రాధేశ్యామ్ చిత్రం చూడాల్సిందే. ఇక విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతూ సినీ ప్రియులంద‌రికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Share post:

Latest