గరం..గరం..గద్వాల రాజకీయం

డీకే అరుణ.. అప్పట్లో కాం‍గ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌.. ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. అయితే ఇప్పుడు అరుణ సొంత నియోజకవర్గం (గద్వాల) ఎమ్మెల్యే అయిన తన మేనల్లుడు బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014లో విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించారు. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. అందుకే 2018లో జరిగిన ఎన్నికల్లో మేనల్లుడు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన బండ్ల క్రిష్ణ మోహన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

అయితే బీజేపీలో చేరిన గద్వాలలో మాత్రం తన పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీ విషయంలో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేశారు. అసలు విషయమేమంటే.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ డీకే అరుణ మంత్రిగా పనిచేసిన సమయంలో గద్వాలలోని పేదలకు 30 ఎకరాల భూమిని ఇళ్ల పట్టాల కోసం పంపిణీ చేశారు. అయితే పేదలు ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకోలేదు. దీంతో అవి అలాగే ఉండిపోయాయి. ఇపుడు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ స్థలంలో నర్సింగ్‌ కళాశాలతో ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అరుణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, పేదలకిచ్చిన ఇంటిస్థలాలను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్యెల్యే పేదల పక్షాన నిలబడకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం..ఆ స్థలంలో ఉత్తమ సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మిస్తున్నామని, ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించడం తప్పా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఇలా సాగుతోంది గద్వాల రాజకీయం.