ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. గురువారం ఢిల్లీలో సోనియాను కలిసి డీఎస్..శుక్రవారం పార్టీలో చేరాల్సి ఉంది. అయితే.. ఎందుకో డీఎస్ కాంగ్రెస్‌కు కండువా కప్పే విషయంపై కాంగ్రెస్ నాయకులు, హైకమాండ్ ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని, అందుకే వాయిదా పడిందని తెలిసింది. పార్టీలో చేరే తేదీని తరువాత చెబుతామని.. అంతవరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పినట్లు సమాచారం.
అయితే రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడైన డీఎస్ సొంత పార్టీకి వస్తానంటే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడే వద్దని చెప్పడం ఏమిటో అని మరికొందరు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏదో మతలబు ఉంటుందని భావిస్తున్నారు. అసలు విషయమేమంటే.. ధర్మపురి శ్రీనివాస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. అయితే ఈ సమయంలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇబ్బందులు వస్తాయని నిపుణులు అధిష్టానం చెవిలో ఊదినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడే ప్రమాదముందని.. అందుకే సంక్రాంతి తరువాత చేరితే పెద్ద ప్రమాదం ఉండదని మేధావులు సలహా ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే.. వాస్తవంగా ఇది కూడా నిజం కాదని.. నిజామాబాద్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు.. డీఎస్ పార్టీలోకి రావడాన్ని ఒప్పుకోవం లేదని, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ఆయన కుమారుడు, బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అయిన ధర్మపురి శ్రీనివాస్ డైరెక్టుగా సోనియాగాంధీనే పలుసార్లు తీవ్రంగా విమర్శించారని.. ఆ సమయంలో డీఎస్ అడ్డుకూడా చెప్పలేదని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. డీఎస్ వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిందని.. అందుకే బ్రేక్ పడినట్లు తెలిసింది. ఏది ఏమైనా డీఎస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.