తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాలిన్ వరుసగా ప్రజా ఆమోద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాలనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు.
ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన వారికి ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తుంది. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉండడంతో బాధిత కుటుంబాలు భారీగానే ఆస్పత్రి ఫీజులు భరించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు చికిత్స కోసం డబ్బు సమకూర్చుకోవడం కూడా చాలామందికి భారంగా ఉంటుంది. ఇది గుర్తించిన స్టాలిన్ ప్రమాదంలో గాయపడిన వారికి 48 గంటల పాటు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఆయా ఆసుపత్రుల పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఉచితంగా 48 గంటల పాటు వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఉచిత చికిత్స కోసం గానూ ‘కాప్పోమ్ నమైకాక్కుమై -48’ అనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారి ప్రాణాలను నిలపడమే ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో 201 ప్రభుత్వ ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆస్పత్రులు.. మొత్తం 609 ఆస్పత్రులను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎంపిక చేసిన ఆసుపత్రులలో 48 గంటల పాటు ఉచితంగా వైద్యం పొందే అవకాశాన్ని కల్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి.