డిప్రెషన్‌లో కూరుకుపోయిన తార‌క్‌..ఎవ‌రు బ‌య‌ట‌ప‌డేశారో తెలుసా?

నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తార‌క్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న‌ ఈయ‌న‌.. ఆపై వ‌రుస ఫ్లాపులను చ‌విచూశారు.

ఆ స‌మ‌యంలోనే వరుస డిజాస్టర్ల‌ను త‌ట్టుకోలేక‌ తార‌క్ డిప్రెష‌న్‌లో కూరుకుపోయార‌ట‌. ఆ టైమ్‌లో ఏం చేస్తున్నానో తెలియని అయోమయంలో పడిపోయార‌ట‌. అలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి ఎన్టీఆర్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళినే బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చార‌ట‌. వరుస ఫ్లాపులతో ఉన్న ఎన్టీఆర్‌కు `యమదొంగ` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ ఇచ్చి మళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కించార‌ట‌.

అంతేకాదు, ఆనాటి నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్‌కు మంచి స్నేహితుడిగా రాజమౌళి ఎప్పుడూ అండగా నిలబడ్డార‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా, ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది.

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పౌ డివివి దాన‌య్య నిర్మించారు. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు న‌టించ‌గా.. అజ‌య్ దేవ్‌గన్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.