రాధేశ్యామ్‌లో `పరమహంస`గా కృష్ణంరాజు..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

లెజెండరీ న‌టుడు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న‌, రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈయ‌న న‌టించిన‌ చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలు జంట‌గా న‌టించారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్‌.. తాజాగా కృష్ణంరాజు పాత్ర‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

రాధేశ్యామ్ చిత్రంలో ఆధ్యాత్మిక గురువు, మహాజ్ఞాని `పరమహంస`గా కృష్ణం రాజు క‌నిపించ‌బోతున్నారు. కాషాయ దుస్తుల్లో ప్రసన్న వదనంతో రుద్రాక్ష చేతబూనిన కృష్ణంరాజును ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. పాత్రకు సరిగ్గా యాప్ట్ అయ్యేలా ఉన్న ఆయన లుక్ విడుదలైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫ‌స్ట్ లుక్ చూసిన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు అదిరింది, సూప‌ర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రంలో భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

Share post:

Latest