ఎన్నికల తరవాత పదవుల జాతర

కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇంకాఉన్నది కేవలం 18 నెలలే.. దీంతో పదవులు దక్కని నాయకులు పార్టీలో కేసీఆర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులొద్దు.. నామినేటెడ్ పోస్టులివ్వాలని కోరుతున్నారు. దీంతో బాసు.. నామినేటడ్ పోస్టుల భర్తీపై ద్రుష్టి సారించారట. ఈనెలల జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఈ కసరత్తు మొదలైనట్లు తెలిసింది. టీఎస్ఆర్టీసీతోపాటు బీసీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్లకు మాత్రమే చైర్మన్లను నియమించారు. రాష్ట్రంలో ఇంకా అనేక కార్పొరేషన్లకు చైర్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మొదటిసారి పవర్ లోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన కేసీఆర్ ఎందుకో.. రెండోసారి సీఎం అయిన తరువాత ఆ విషయంపై ద్రుష్టి సారించలేదు. అయితే ఇటీవల పార్టీలో అసంత్రుప్తుల జాబితా పెరుగుతుండటంతో వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ లు కూడా పార్టీని వీడటం పార్టీలో చర్చనీయాంశమైంది. చాలా మంది నాయకులు తమతో టచ్ లో ఉన్నారని కమలం పార్టీ నాయకులు కూడా ఇటీవల బహిరంగంగానే చెప్పడం కేసీఆర్ ను కలవరపరుస్తున్నట్లు తెలిసింది. ఎందుకైనా మంచిది.. వందలకొద్దీ నామినేటెడ్ పోస్టులున్నాయి.. వాటిని భర్తీ చేసి నాయకులు ఇతర పార్టీల్లోకి తరలి వెళ్లకుండా చూడాలని కేసీఆర్ అనుకుంటున్నారట. నిజంగా అదే జరిగితే కారు పార్టీలో దాదాపు అందరికీ పదవులు వచ్చినట్లే. అందరూ హ్యాపీ..