సాధారణంగా కొన్ని కొన్ని సినిమాల కోసం హీరోలు శ్రమకు మించి కష్టపడుతుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి తీవ్రంగా నిరాశ పరుస్తుంటాయి. అటువంటి చిత్రమే మృగరాజు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది.
సంఘవి, నాగబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని దేవీ ఫిల్ం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాత కె. దేవీవరప్రసాద్ అప్పట్లోనే ఏకంగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అడవి నేపథ్యంలోనే సాగే ఈ సినిమాలో చిరంజీవి సింహం తో పోరాడాల్సి ఉంటుంది.
అందుకోసమే రియాలిటీ గా ఉండాలని అప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలలో నటించిన జాక్ అనే సింహాన్ని రూ.67 లక్షలు ఖర్చు పెట్టి రప్పించారు. 26 రోజుల పాటు ఆ సింహం షూటింగ్ లో పాల్గొంది. అనుకున్నట్టుగానే రియల్ సింహానికి, చిరంజీవికి మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సినిమా కోసం చిరంజీవి ఏకంగా రోజుకు 20 గంటలు చొప్పున కష్టపడ్డారు. అయినప్పటికీ.. ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల మధ్య 2001లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి.