తెలుగులో అగ్ర హీరోలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమాలు రావడం చాలా అరుదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు హయాంలో మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హయాంలో మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. ఇద్దరు స్టార్ డమ్ ఉన్న హీరోలను ఒక సినిమాలో ఇద్దరికీ సమాన పాత్ర ఇవ్వాలంటే దర్శకుడికి కత్తి మీద సామే. అది కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను మెప్పించడం కష్టమే. ఏ ఒక్కరికి ప్రాధాన్యం పెరిగిన మిగతా హీరో
ఫ్యాన్స్ ఒప్పుకోరు.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైనప్పుడే మీడియా నుంచి ఈ ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. అయితే రాజమౌళి ‘నా సినిమాల్లో ఒక హీరో ఉంటేనే ఎంత ఎలివేషన్ ఇస్తానో మీకు తెలుసు.. ఇద్దరు హీరోలు ఉన్నా.. వాళ్ళను ఎలా చూపాలో నాకు తెలుసు. ఏ ఒక్క హీరోకు ప్రాధాన్యం తగ్గకుండా నా సినిమా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు.కానీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్ లో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించగా.. ఎన్టీఆర్ ఒకే లుక్ లో ఉన్నారని వాళ్ళ ఆరోపణ. అయితే ట్రైలర్ లో రాజమౌళి కావాలనే రామ్ చరణ్ ను హైలెట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోల్లో ఎన్టీఆర్ పాత్ర మొదటి నుంచి జనం కోసం పోరాడుతుంటే..రామ్ చరణ్ పాత్ర మాత్రం బ్రిటిష్ వారి తరఫున పనిచేసే పోలీస్. స్వాతంత్రం కోసం పోరాడే వారిని అణగదొక్కే పాత్ర అది. అంటే ఆటోమేటిక్ గా రామ్ చరణ్ పాత్రపై ప్రేక్షకుల్లో కొంచెం నెగిటివిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత చరణ్ పాత్ర బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారిన తర్వాతే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతుంది.
సినిమా మొత్తంలో చాలా భాగం చరణ్ పాత్ర బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. సినిమా విడుదలైన తర్వాత ఆయన ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ట్రైలర్ లో చరణ్ పాత్ర కొంచెం హైలెట్ చేసి చూపిస్తే ఫ్యాన్స్ కొంత సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత సినిమా చూసాక కొంచెం అసంతృప్తి కలిగినా పట్టించుకోరు.. అని రాజమౌళి భావిస్తున్నట్లుగా ఉంది. ఏదేమైనా రాజమౌళి లాంటి దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ని ఆయన సంతృప్తి పరిచే అవకాశమే ఎక్కువగా ఉంది.