యూపీలో ‘పవర్‌’ పాలిటిక్స్‌

ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. మోదీ, అమిత్‌ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా పక్కా ప్లాన్‌ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్‌ నింపింది. ఇక ఎలాగైనా మరోసారి గెలవాలనే పట్టుదలతో కమలం పార్టీ అధిష్టానం లక్ష్యం నిర్దేశించుకుంది. అందుకే కిందిస్థాయి కార్యకర్తలు మొదలు జాతీయస్థాయి నాయకుల వరకు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యతను అప్పగించారు. ఈ ప్లాన్‌లో భాగంగా ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు చేయాలని హైకమాండ్‌ నిర్ణయించింది. అతిపెద్ద రాష్ట్రం కాబట్టి.. ఒక్కరే యాత్ర పూర్తి చేయడం అసాధ్యమని భావించిన పార్టీ పెద్దలు ఆరు యాత్రలు చేపట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్‌నాయకుడు విద్యాసాగర్‌ యాత్రలకు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త ఎత్తుగడ
బీజేపీకి దీటుగా కాంగ్రెస్‌ ప్రతివ్యూహాలు పన్నుతోంది. ప్రియాంకగాంధీ యూపీ పార్టీని మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా సొంత పార్టీ నాయకులకే కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ విధించింది. ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకునే అభ్యర్థి కనీసం 10వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని టార్గెట్‌ నిర్ణయించింది. సభ్యత్వాలు చేయలేకపోతే వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోబోమని కచ్చితంగా చెప్పేసింది. 10వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్పిస్తే వారి మద్దతుతో మరిన్నివేల ఓట్లు వస్తాయనేది కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్‌. దీంతోపాటు రూ.11వేలు పార్టీ ఫండ్‌ ఇవ్వాలని కండిషన్‌ పెట్టింది. హైకమాండ్‌ కండిషన్లు చూసిన ఆశావహులు బెంబేలెత్తుతున్నారు. ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎన్నికల్లో ఏం పోటీచేస్తారని నాయకులు కిందిస్థాయి కార్యకర్తలతో పేర్కొంటున్నారు. ఇలా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు యూపీలో పవర్‌ పాలిటిక్స్‌ నడుపుతూ పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.