అనసూయ భర్తను చంపడం ఏంటీ అని అనుకుంటున్నారా..? ఖంగారు పడకండి అది రియల్ కాదు రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న అనసూయ మరోవైపు వెండితెరపై సైతం విలక్షణ పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన దాక్షాయణి పాత్రను ఆమె పోషిస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రమే `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ మెయిన్ విలన్‌గా నటిస్తుండగా.. మరో విలన్ `మంగళం శ్రీను`గా సునీల్, ఆయన భార్య `దాక్షాయణి`గా అనసూయ కనిపించబోతున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేయడానికి ముందు ట్రైలర్ టీజ్‌ను ఇటీవల విడుదల చేసింది.
అయితే ఈ టీజ్‌లో అనసూయ క్యారెక్టర్ గురించి ఓ ఫొటో రూపంలో చిన్న హింట్ వదిలారు. అందులో అనసూయ నోటితో బ్లేడ్ పట్టుకుని కోపంగా చూస్తూ మంచంపై ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపుతున్నట్లు కనిపిస్తోంది. ఇక అనసూయ చేతిలో హత్యకు గురి కాబోతున్నది ఎవరో కాదు.. సునీల్ అని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్‌ను ఆమె భార్య అయిన అనసూయే చంపేస్తుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే డిసెంబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.