వారిని అదుపు చేయకపోతే కష్టమే..

కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు.. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తరువాత అక్కడ పెద్దగా రాజకీయ కార్యకలాపాలు సాగించలేదు. ఆ తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై .. ఇపుడు మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ఆమె ద్రుష్టి మొత్తం నిజామాబాద్ ఎంపీ స్థానంపైనే ఉంది. రెండున్నరేళ్లుగా జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోని కవిత ఇటీవల జిల్లాలో పర్యటిస్తున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కార్యకర్తలు, నాయకులకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు ఆమెకు జిల్లాలోని ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేశారట.

జిల్లాలో అనేకమంది భూ కబ్జాలను ప్రోత్సహిస్తుండటంతోపాటు సెటిల్ మెంట్లలో పాల్గొంటున్నారని పేర్కొన్నారట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నిజామాబాద్ లో జరిగే ఎన్నికల్లో మళ్లీ ప్రతికూల ఫలితాలు ఉంటాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. దీంతో వెంటనే అలర్ట్ అయిన కవిత స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. తన తండ్రి కేసీఆర్ సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యుందుకు ప్రయత్నిస్తుంటే..ఇక్కడి నాయకులు మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని..

ఇవి ఇలాగే కొనసాగితే అసలుకే నష్టం వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. 2019లో జరిగిన నిజామాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవితను బీజేపీ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ ఓడించిన సంగతి తెలిసిందే.మళ్లీ ఆ ఫలితాలు పునరావ్రుతం కాకూడదని కవిత గ్రామస్థాయి నుంచి నాయకులతో మాట్లాడటం, కార్యక్రమాలకు హాజరు కావడం లాంటివి చేస్తున్నారు. మరో రెండున్నరేళ్లల్లో ఎన్నికలు వస్తాయి. జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగరాదని, మారాల్సిందే అని కవిత కచ్చితంగా ఆదేశించారట. దీంతో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారని తెలిసింది. ఏది ఏమైనా పార్లమెంటులో అడుగు పెట్టేందుకు కవిత శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం.