సారుకు సడన్ గా రోడ్లెందుకు గుర్తుకొచ్చాయో?

కాస్త ఆలస్యమైనా ఏపీ సీఎం జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని.. ఒక్క గుంత కూడా రోడ్డుపై కనిపించరాదని అధికారులను ఆదేశించారు. 46వేల కిలోమీటర్ల రోడ్లను జూన్ 2022లోపు మరమ్మతులు చేయాలని, రోడ్లన్నీ క్లీన్ గా కనిపించాలని పేర్కొన్నారు. ఈనెలాఖరు నాటికి 8268 కిలోమీటర్ల రోడ్లకు రిపేరు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కూడా ఆదేశించారు. పల్లె, పట్టణం, మునిసిపాలిటి, కార్పొరేషన్, రాష్ట్ర.. ఇలా ఏ రహదారైనా రిపేరు కావాల్సిందే.. అందుకు సాకులు కూడా చెప్పవద్దు. పాఠశాలలను నాడు..నేడు పద్ధతిలో మెరుగు పరచి ఉన్నతంగా తీర్చిదిద్దినట్లుగానే రోడ్లను కూడా నాడు..నేడు విధానంలో చేయాలని, రాష్ట్రంలో రోడ్ల రూపు రేఖలే మారిపోవాలని దిశానిర్దేశం చేశారు.

సమీక్షా సమావేశంలో సీఎం సారుకు రోడ్లెందుకు గుర్తుకొచ్చాయి.. ఉన్నట్టుండి రోడ్లను రిపేరు చేయాలంటే సాధ్యమా.. అదీ వేల కిలోమీటర్ల కొద్దీ రోడ్లను నెలాఖరుకు ఎలా బాగు చేస్తారని అధికారులు గుసగుసలాడారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయింది.. రోడ్లను బాగు చేస్తాం.. నీటుగా తీర్చిదిద్దుతాం.. రెండు వేల కోట్లను కేటాయిస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు..సమీక్షలే తప్ప రోడ్డు వైపు వెళ్లిందీ లేదు. ఉన్నట్టుండి మరమ్మతులు చేయాల్సిందే అంటే జనం కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వమైనా ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి గానీ రాత్రికి రాత్రు పనులు చేస్తామని చెప్పే ప్రకటనలు చేయరాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాలో ఓ యువకుడు తమ గ్రామానికి రోడ్డు సరిగా లేదని.. వచ్చే వారు ప్రమాదాలకు గురికాకుండా సొంతంగా రోడ్డునే వేయించాడు. ఈ ఒక్క సంఘటన చాలు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. సెంట్రల్ ట్రాన్స్ పోర్టు మినిస్టర్ నితిన్ గడ్కరి వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనున్నందున పెండింగ్ ప్రాజెక్టులు,నిధులకు సంబంధించిణ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. సీఎం ప్రకటనతో అయినా రెండేళ్లలో రోడ్ల మరమ్మతులు పూర్తి అయితే అంతకంటే ఇంకేం కావాలని ప్రజలు పేర్కొంటున్నారు.