వర్లగారూ.. మీ మేడం లెటర్లో ఫైర్ ఉందా?

రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు.

ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అన్నట్లుగా ప్రచారంలో ఉన్న నిందలు, అసభ్య పదజాలం గురించి జూనియర్ ఇచ్చిన ఖండన ఆయనకు నచ్చలేదు. మేనత్తకు అవమానం జరిగితే మాట్లాడేది అలాగేనా? ఆ ప్రకటనలో ఫైర్ లేదు.. అంటూ వర్ల రెచ్చిపోయారు. నిజానికి జూ. ఎన్టీఆర్ చాలా సంయమనంతో మాట్లాడారని చాలా మంది అనుకుంటే.. వర్లకు మాత్రం అది చేతగాని మాటల్లా కనిపించాయి.

అయితే దీనికి జవాబుగా.. మేనత్త గురించి ఎన్టీఆర్ ఖండనను విమర్శించే ముందు, అసలు తల్లి కి జరిగిన అవమానం గురించి లోకేష్ ఎంత ఫైర్ తో స్పందించాడో చూసుకోవాలి క దా అంటూ పలువురు దెప్పిపొడిచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా నారా భువనేశ్వరి విడుదల చేసిన ప్రకటన/ ఓపెన్ లెటర్ వర్ల వ్యాఖ్యలు మరోసారి చర్చలోకి వచ్చేలా చేస్తోంది.

నారా భువనేశ్వరి విడుదల చేసిన ప్రకటన ఇదీ..

‘‘ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునాధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.

వర్లగారు గమనిస్తున్నారో లేదో గానీ.. స్వయంగా అవమానానికి గురైన భువనేశ్వరి మాటల్లో ఫైర్ ఎక్కడుంది. ఆమె ప్రకటన చాలా హుందాగా సంయమనం కోల్పోకుండా ఉంది. ఆమె చాలా గౌరవంగా ప్రకటన విడుదల చేశారు. మరి వర్ల రామయ్య గారు.. ఫైర్ లేదంటూ.. భువనేశ్వరి మీద కూడా నోరు పారేసుకుంటారేమో చూడాలి. అలా కాకపోతే.. ఆ ప్రకటన ఆయనకు హుందాగా కనిపిస్తే, ఎన్టీఆర్ మీద ఎందుకు నోరు పారేసుకున్నారో చెప్పాలి.

తమ మేడం హుందాతనం మాత్రం గొప్పది- ఎన్టీఆర్ హుందాతనం మాత్రం చేతగానితనం అనుకుంటే ఎలా? తాను చేస్తే శృంగారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంటుంది కదా!

Share post:

Latest