జిల్లాల్లో రెండు రోజులపాటు బండి ..!

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో వేడిపుట్టిస్తోంది. రైతులకు మద్దతుగా బీజేపీ, టీఆర్ఎస్ మాట్లాడుతున్నా.. వారికి పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. మీరు కొనండి.. మీరు కొనండి అని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు తప్ప.. రైతులకు మాత్రం భరోసా ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ పార్టీ కేంద్రం పద్ధతికి నిరసనగా ధర్నాలు చేస్తే..బీజేపీ కారు పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టింది. పోనీ సమస్య పరిష్కారం అయిందా అంటే.. లేదు.. అక్కడే ఆగిపోయింది. ఇపుడు టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరో కార్యక్రమం చేపట్టారు. రైతులకు మద్దతుగా.. కేసీఆర్ తీరును నిరసిస్తూ జిల్లా పర్యటనలు చేయనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి కేసీఆర్ తీరును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. రైతుల గురించి రాష్ట్రం అసలు పట్టించుకోవడం లేదు..అని రైతులకు విడమరచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడంతోపాటు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో పర్యటిస్తారు. మిర్యాలగూడ, నేరేడుచెర్ల, గడ్లిపల్లిలో అన్నదాతను కలిసి వారి ఆవేదనను తెలుసుకుంటారు. సోమ, మంగళ వారాలలో బండి సంజయ్ యాత్ర సాగుతోంది. వరి కొనుగోలు సమస్యపై బీజేపీ హడావిడి చేస్తుంటే రాష్ట్రం మాత్రం ధర్నాలు చేసి మౌనంగా ఉండిపోయింది. వరి కొనేవారు లేక రైతులు దిగాలుగా ఉంటే ఈ రెండు పార్టీలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. కష్టపడి పంట పండించిన తరువా ధాన్యం కొనుగోలుకు ఇంత కష్టపడాలా అని రైతు మద్దతు దారులు పేర్కొంటున్నారు.

Share post:

Latest