నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు…

తెలంగాణలో రాజకీయం ఊపందుకుంది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీరలా చేశారు.. వారలా చేశారు.. అనుకుంటూ కాలం గడుపుతున్నారు. అసలే రైతులు వరి కొనుగోలు సమస్యతో ప్రాణాలు కోల్పోతుంటే ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి మానాన వారు చేశామంటే.. చేశామని నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో ప్రారంభమయ్యాయి. బీజేపీ అగ్రనాయకుడు, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ సమావేశాలకు హాజరయ్యారు. నాయకులనుద్దేశించి మాట్లాడారు. వారికి దిశా నిర్దేశం చేశారు. మంచిదే.. అటువంటి ఉద్దండ నాయకుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తరుణ్ చుగ్ ఆ తరువాత మీడియాతో మాట్లడారు.

ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు వింటే రాజకీయాలు తెలిసిన వారికే కాదు.. రాజకీయాలంటే అస్సలు తెలియని వారికి కూడా నవ్వు ఆగదు. అరె.. ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడు అంతమాట ఎలా మాట్లాడతాడు అని సొంత పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. ఇక మీడియా ప్రతినిధులకైతే నవ్వాగలేదంటే నమ్మండి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. తెలంగాణ రాష్ట్రలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 స్థానాల్లో గెలుస్తాం.. టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే దొరకరు.. కనీసం 60 మంది కూడా పోటీచేసేందుకు ముందుకురారు అని పేర్కొన్నారు. వినడానికి ఈ మాటలు చాలా విచిత్రంగాను, వింతగాను ఉన్నాయి. అరె..టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉంది.. అసెంబ్లీలో వారిదే బలమంతా.. మీ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే.. అటువంటి పార్టీలో ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులే లేరంటే నమ్మేదెవరు? మీ సొంత పార్టీ కిందిస్థాయి కార్యకర్త కూడా మీ మాటలు విని ఏమీ అనలేక ఊరికే ఉండిపోయాడు. ఒక రాజకీయ పార్టీగా పోటీ చేసేందుకు మీరు అర్హులే.. కానీ అధికార పార్టీని మరీ అంత తీసిపారేస్తే జనం ఎలా నమ్ముతారు సార్. ఏమైనా మాట్లాడేముందు కాస్తయినా ఆలోచించాలి కదా?