రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…

తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్‌, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్‌ ఫ్యామిలీ అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం కవిత ఆమె రాజకీయ బలంతోపాటు సామర్థా‍్యన్ని చూపుతాయని పేర్కొన్నాడు.

తెలంగాణ రాష్ట్ర లేజిస్లేటివ్‌ కౌన్సిల్‌ లో కవిత ప్రజల తరపున సమస్యల పరిష్కారానికి ప్రాతినిథ్యం వహించడంతోపాటు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. అయితే.. రామోజీ ఇలా కవితకు ప్రత్యేకంగా బహిరంగ లేఖరాయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రామోజీ ఎందుకిలా భజన చేస్తున్నాడోనని పేర్కొంటున్నారు. ఇదే సంవత్సరం జులై 23న కేసీఆర్‌ కుమారుడు, మం‍త్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ కూడా లేఖ రాశాడు. ఆ లేఖలో కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశాడు. ప్రజాజీవితంలో విజయం సాధించడంతోపాటు భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు. ఇపుడు ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక కావడంతో భజన పునరావృతం చేశాడు. ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక కావడం పెద్ద విశేషమేమీ కాదు.. ఈమెతోపాటు మరో ఆరుగురు కూడా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మెజారిటీ ఉండటంతో సులువుగానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఇటువంటి సందర్భంలో కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాయడం ఏమిటి? అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. దీనికి సమాధానమేమంటే.. కేసీఆర్‌ కుటుంబానికి రామోజీరావు దగ్గరకావడమే అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Share post:

Latest