మోదీసాబ్‌.. అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ తాను అనుకున్నది అనుకున్నట్లు కచ్చితంగా అమలు చేసి తీరతారు. ప్లాన్‌ పకడ్బందీగా ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పెద్దటీమ్‌ ఉంది. మోదీకి ఏదైనా ఆలోచన వస్తే చాలు.. దాని అమలుకు ఈ టీమ్‌ సర్వశక్తులు వడ్డుతుంది. సోషల్‌ మీడియాలోనూ అంతే.. మోదీ ఫాలోయింగ్‌ను ఈ టీమ్‌ ఓ రేంజ్‌లో పెంచుతుంది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ వార్తల్లో నిలిచారు. గత యేడాది చేసిన రైతు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఘోషించినా ఆయన చెవికెక్కలేదు. అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా చెప్పినా పట్టించుకోలేదు. అయితే రైతులు మాత్రం వెనక్కు తగ్గలేదు. గత సంవత్సరం నవంబర్‌ నుంచి చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏడాదికిపైగా కొనసాగాయి. త్వరలో యూపీతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తుండటంతో మోదీకి వ్యతిరేక పవనాలు కనిపించాయి.

అంతే..మోదీ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రైతు చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ రోజు (సోమవారం) పార్లమెంటులో రద్దు కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఈ రైతు చట్టాలు చేసినప్పుడు పార్లమెంటులో చర్చించేందుకు సభ్యులకు అవకాశం ఇవ్వకుండా బిల్లు పాస్‌ చేశారు. కనీసం చర్చించే అవకాశం కూడా ఇవ్వకుండా ఏమిటీ నియంతృత్వం అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అయినా .. ఆయన వింటే కదా.. బిల్‌ పాస్‌ చేశారంతే. ఇపుడు కూడా అంటే చట్టాలు రద్దు చేసే సమయం వచ్చింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రద్దు చేశారు. ఈసారి కూడా నో డిస్కషన్స్‌..బిల్లు రద్దుచేశారంతే. ఇంతఅన్యాయమనా.. ప్రతిపక్షాలకు పార్లమెంటులో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమేంటని పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. యూపీ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ రద్దు జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం ఏం చెప్పాలో తెలియక ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.