కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. రాష్ట్రాల ధర్మబద్ధమైన వినతుల్ని ఉపేక్షిస్తూ ఉండే కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల తన ధిక్కార స్వరాన్ని ఆయన ఓపెన్‌గానే వినిపించదలచుకున్నారు.

స్వయంగా అమిత్ షా అంతటి నాయకుడు వచ్చి సమావేశం నిర్వహిస్తున్నప్పుడు.. గైర్హాజరు కావడం.. ఆ సమావేశం ప్రాధాన్యాన్ని చిన్నచూపు చూడడం చిన్న సంగతి కాదు. కేరళలో రాజ్యమేలుతున్న కమ్యూనిస్టులు సైద్ధాంతికంగతానే విభేదిస్తారు గనుక.. వారు అమిత్ షా సమావేశాన్ని పట్టించుకోకపోవడంలో వింతేమీ లేదు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే స్టాలిన్- తన సొంత నియోజకవర్గంలో పర్యటన ఉన్నదంటూ.. కొన్ని నెలల కిందట ఖరారు అయిన ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.

అక్కడే కేసీఆర్ తన ధిక్కారాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించారు. మొహమాటం ఏమీ లేదు. ‘అమిత్ షాతో సమావేశానికి కార్యక్రమానికి రాలేకపోతున్నాను’ అనే అర్థం వచ్చేలా వేరే ఇతర కార్యక్రమాలు కూడా పెట్టుకోలేదు. ‘నేను రాదలచుకోలేదు’ అని మాత్రమే అర్థం వచ్చేలా.. ఆయన తన రోజును ఖాళీగానే గడిపారు తప్ప.. తిరుపతి వెళ్లలేదు. తమ ప్రభుత్వం తరఫున మంత్రి మహమూద్ ఆలీని పంపారు.

కేసీఆర్ తొలినుంచి కూడా కేంద్రంలోని బీజేపీ దుర్మార్గపు పోకడలను దునుమాడుతూనే ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా అంటూ ఆయన కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు.. రాష్ట్రప్రభుత్వాల చేతులు కట్టేసేలా.. మోడీ సర్కారు జోక్యం చేసుకుంటున్న తీరులపై గతంలోనూ అనేకమార్లు స్పందించారు.

జాతీయస్థాయిలో భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటుచేసి.. బలోపేతం చేయడం.. మోడీ సర్కారుకు గడ్డు రోజులు తీసుకురావడగం లక్ష్యంగా కేసీఆర్ చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో భేటీ అయి.. వారందరినీ కూడగట్టడం కోసం చాలా పనిచేశారు.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీతో వైరం ఇంకా పెరిగింది. ప్రత్యేకించి హుజూరాబాద్ ఎన్నిక తర్వాత.. కేంద్రం వైఖరులపై కేసీఆర్ ప్రత్యక్ష దాడికి దతిగడం కూడా పెరిగింది. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక పోకడలపై అధికార పార్టీ తరఫునే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం విశేషం. అదే సమయంలోనే.. కేంద్రం మీద, బీజేపీ మీద హాట్ హాట్ గా కారాలు మిరియాలు నూరుతున్న సమయంలోనే అమిత్ షా తో సమావేశం జరగగా.. దానిని ఖాతరు చేయకుండా.. కేంద్రంతో మెతకధోరణి లేనే లేదని.. అమీ తుమీ తేల్చుకోవడమేనని ఆయన తేల్చేశారు.

బీజేపీపై యుద్ధానికి కేసీఆర్ ఎప్పుడో శంఖం పూరించారు. ఈ తిరుపతి సమావేశానికి గైర్హాజరీ సాక్షిగా ఆయన బలమైన అస్త్రాలను సమకూర్చుకుంటున్నారు.