కాక పుట్టిస్తున్న కంగన కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగన రనౌత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి జనం నోళ్లలో నానే కంగన పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులు..ఇలా అందరూ కంగనను దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ఆమెలో చలనం లేదు.. తన మాటలను, కామెంట్స్ ను వెనక్కు తీసుకోలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచి ఆజాదీ కా అమ్రుతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో కంగన సడన్ గా స్వాతంత్ర్యంపై వ్యాఖ్యనించడం.. అదీ విచిత్రమైన కామెంట్ చేయడం దేశ ప్రజలకు కోపం తెప్పించింది. అరె.. ఈమెకేమైనా మెంటలా? అని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 లో అని అందరికీ తెలుసు.. ప్రతి సంవత్సరం వేడుకలు కూడా చేసుకుంటున్నాం..

అలాంటిది మన దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదు భిక్ష.. 2014లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చింది అని కంగన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. స్వాతంత్ర్య దినోత్సవంపై ఎప్పుడూ.. ఎవరూ చేయని కామెంట్స్ కంగన చేయడంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డు కూడా వెనక్కు తీసుకోవాలని ఘాటుగా పేర్కొంటున్నారు. కొందరైతే దేశప్రతిష్టకు సంబంధించిన అవార్డులు ఇచ్చే ముందు వారి మానసిక స్థితిని తెలుసుకోవాలని కోరుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు కానీ, కంగన కానీ ఏమీ మాట్లాడటం లేదు. రోజు రోజుకూ కంగన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి భవిష్యత్తులో ఇటువంటి కామెంట్స్, దేశ గౌరవానికి భంగం కలిగించే మాటలు ఎవరూ మాట్లాడకుండా చర్యలు తీసుకోకపోతే ఇటువంటి కామెంట్స్ మరికొందరు చేసి ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే ప్రమాదముంది.