వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!

November 26, 2021 at 10:31 am

జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం పార్టీకి పరువు తక్కువగా చాలా మంది భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. దానిపై ఆయనకు చాలా మంది సానుభూతి తెలియజేశారు. అంతవరకు అంతా బాగానే ఉంది. వైసీపీ వారు చేశారని చెబుతున్న విమర్శలు భువనేశ్వరి గురించి గనుక.. బాలయ్య ఆధ్వర్యంలో నందమూరి కుటుంబం వారందరూ కూడా స్పందించారు. ఇలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. అదే క్రమంలో ఎన్టీఆర్ కూడా ఇలాంటి అసభ్యపు విమర్శలను ఖండించాడు. అయితే బాలయ్య అండ్ కో.. రెచ్చిపోయి తొడకొట్టినట్టుగా ఖండిస్తే.. ఎన్టీఆర్ మర్యాదగా, సౌమ్యంగా ఖండించాడు. అది వర్ల రామయ్యకు నచ్చలేదు. ఆయన ఎన్టీఆర్ మీద విరుచుకుపడ్డారు.

వర్ల మాటలు చాలా లేకిగా ఉన్నాయి. వైసీపీ మీద యుద్ధం ప్రకటించకుండా, మాటలు అన్నవాళ్లని కత్తితో పొడిచి చంపేయకుండా ఎన్టీఆర్ ఏం చేస్తున్నారని ఆవేదన చెందినట్లుగా ఉన్నారు వర్ల రామయ్య. వంశీని, కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్ మీద ఉన్నదన్నారు. హరికృష్ణతో కంపేర్ చేశారు. ఇదంతా చేస్తూ.. డెబ్భయి అయిదేళ్ల ముసలివాడిలా మాట్లాడుతున్నారని అన్నాడు.

వీటన్నింటినీ మించి.. ‘పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మా వెంట ఉన్నవారినే మేం గుర్తిస్తాం’ అన్నమాట ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ అది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేట్టుగా ఆ మాటలు ఉన్నాయి. ఆ సంగతి చెప్పడానికి వర్ల రామయ్య ఎవరు? అనేది పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం.

చంద్రబాబునాయుడు ప్రస్తుతం తన కుమారుడు లోకేష్ ను వారసుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. లోకేష్ తన సమర్థతను నిరూపించుకోలేకపోతున్నారు. అది ఇంకాస్త బయటపడ్డాక అయినా.. ఎన్టీఆర్ రంగప్రవేశం చేసి.. పార్టీకి ఒక జోష్ తీసుకువస్తారనే నమ్మకం చాలా మంది కమ్మ వారిలో ఉంది. అయితే.. వర్ల రామయ్య లాంటి వాళ్లు పార్టీ విస్తృతప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నది వారి ఆవేదన. ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ గెలిచిన చరిత్ర లేకపోయినా.. వర్ల రామయ్య ఇలాంటి వదరుబోతు మాటలతో పార్టీకి చేటుచేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts