ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి.

ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు చంద్రబాబునాయుడుకు ఉండవలసిన ప్రజాబలం ఎక్కడకుపోయింది. తెలుగుదేశం నాయకులు ఎవ్వరూ ఆ కోణంలో ఆలోచించడం లేదెందుకు? సరిగ్గా ఇదే సమయంలో.. ఇటీవలే తెలంగాణ రాష్ట్రం హుజూరాబ్ లో జరిగిన ఎమ్మెల్యే ఉపఎన్నికతో పోల్చిచూడాలని అనిపిస్తుంది. అలా పోల్చిచూసినప్పుడు.. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు ఉన్న విలువ, వప్రజాదరణ కుప్పంలో చంద్రబాబునాయుడకు లేదని మనకు అర్థమైపోతుంది.

కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ మీద అవినీతి, భూకబ్జా ఆరోపణలు రావడం, వాటిమీద కేసీఆర్ సీరియస్ అయి.. ఆయనను కేబినెట్ నుంచి తొలగించడం.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం ఒక డ్రామాలాగా జరిగిపోయాయి. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, ఉపఎన్నికలో కేసీఆర్‌పై తొడగొట్టారు. హరీష్ రావు నెలల తరబడి నియోజకవర్గంలోనే తిష్టవేసి ఈటలను ఓడించడానికి పనిచేశారు. ఈటల ధిక్కారం అనేది కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకోవడంతో.. ఈటల ఓటమికి పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. ఓటుకు పదివేల రూపాయల వంతున పంచారు. దళితబంధు లాంటిఆరోపణలన్నీ పుష్కలంగా ఉన్నాయి.

ఇన్ని జరిగినా సరే.. ఈటల రాజేందర్ ఒంటరిగా పోరాడి ఈ ఎన్నికను గెలిచారు. కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ప్రజాబలం అంటే అది. అధికార పార్టీ ఎన్ని అరాచకాలుచేసినా, ప్రలోభాలు పెట్టినా తట్టుకుని గెలవడమే ప్రజాబలం. మరి కుప్పంలో చంద్రబాబునాయుడు ప్రజాబలం ఏమైంది? అసలు ఆయనకు నిజంగానే ప్రజాబలం ఉందా? లేదా అలా మాయ చేస్తున్నారా? అనే సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నిజాయితీగా ఆత్మసమీక్ష చేసుకుంటే సొంతలోపాలు ఆయనకే విపులంగా బోధపడుతాయి.