‘జూనియర్‌’ను ఏమీ అనకండి

తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత జూనియర్‌ ఎన్టీయార్‌ కూడా తమ అత్తమ్మపై జరిగిన మాటలదాడిని ఖండిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను చూసిన తరువాత టీడీపీ కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. అరె..ఏంది.. తారక్‌ ఇలా మాట్లాడాడు? మరీ అంత సాఫ్ట్‌గా మాట్లాడితే ఎలా? అని పలువురు ప్రశ్నించారు.

వర్ల రామయ్య అయితే ఏకంగా జూనియర్‌ను టార్గెట్‌ చేసినంత పనిచేశాడు. సింహాద్రిలా వస్తాడనుకుంటే చాగంటిలా వచ్చాడని విమర్శించాడు. ఆ తరువాత వర్లరామయ్యా కామెంట్స్‌పై జూనియర్‌ ఫ్యాన్స్‌ గుస్సా అయ్యారు. తారక్‌ ఫ్యాన్స్‌కు కోపం రావడంతో టీడీపీ అధిష్టానం అలర్ట్‌ అయింది. తారక్‌ ఇంకా టీడీపీలోనే ఉన్నాడు.. ఆయనను అనవసరంగా నిందించకండి అని పార్టీ నాయకులకు అధిష్టానం అంతర్గత ఆదేశాలు జారీచేసిందని తెలిసింది. వైసీపీ ముఖ్య నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు తారక్‌కు బాగా దగ్గర కావడం వల్లే ఇంత సాఫ్ట్‌గా మాట్లాడాడని పేర్కొంటున్నారు. ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తే వైసీపీపై దృష్టి మళ్లుతుందని కూడా టీడీపీ నేతల భయం. ఎన్టీయార్‌ను టీడీపీ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఆయన మద్దతు లభించకపోవచ్చనే భయం కూడా బాబును వెంటాడుతోంది. అందుకే.. ఎన్టీఆర్‌ జోలికి వెళ్లకండి అని కచ్చితంగా చెప్పేసింది పార్టీ అధిష్టానం.