సుజనా, సీఎంలకు తలంటు పోసిన అమిత్ షా!

కేవలం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం మాత్రమే కాదు..  కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన తిరుపతి పర్యటనను రాష్ట్రంలో పార్టీని చురుగ్గా పరుగులు పెట్టించడానికి కూడా ఒక అవకాశంగా మలచుకున్నారు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం నాడే పూర్తి కాగా, సోమవారం పూర్తిగా పార్టీ నేతలతోనే గడిపారు. వారితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం గురించి.. వారికి దిశానిర్దేశం చేశారు.

అయితే ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకులకు అమిత్ షా ఒక రేంజిలో తలంటు పోసినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన ఇద్దరు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో అమిత్ షా తిరుపతిలో విడిగా సమావేశం అయ్యారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో కలిసిమెలిసి వెళ్లకుండా.. తెలుగుదేశం మూలాలు ఉన్న ఆ ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీలో ఉన్నాయి. ఈ విషయాన్ని అమిత్ షా సీరియస్ గా తీసుకున్నారు.

పార్టీని బలోపేతం చేయడానికి నాయకుల సమావేశం నిర్వహిస్తే.. ఆ సమావేశాన్ని రెండు గ్రూపులుగా, రెండు సార్లు నిర్వహించడం చూస్తేనే.. రాష్ట్ర పార్టీ ఎంత ఐక్యంగా ఉన్నదో అర్థమవుతోందని అమిత్ షా అక్షింతలు వేసినట్టు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ- జనసేన మధ్య పొత్తు ఉంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకుంటాయని, మూడు పార్టీలు కలిసే ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతాయని ఒక ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారానికి కారకులుగా భావిస్తున్న రాష్ట్ర నాయకులకు అమిత్ షా సీరియస్ గానే క్లాసు పీకారు. పొత్తులు గురించి మీరెందుకు మాట్లాడతారు జాతీయ నాయకులు చెబుతారు కదా అని హితవు చెప్పినట్టు సమాచారం.

అలాగే.. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా బీజేపీ పాల్గొనకపోవడాన్ని కూడా అమిత్ షా సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీ ఉపయోగించుకోవడం లేదని హితవు చెప్పారు. అమరావతి ఒకే రాజధానిగా పార్టీ తీర్మానం చేసిన తర్వాత.. వారి దీక్షలకు మద్దతు ఇవ్వకపోతే ఎలా అని రాష్ట్ర నేతలను మందలించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి తిరుపతిలో అమిత్ షా యాత్ర తరువాత.. రాష్ట్ర బీజేపీలో , వారి విధానాలలో ఆలోచనల్లో, దూకుడులో కొంత మార్పు తథ్యం అనిపిస్తోంది.