’83’ ట్రైలర్ : వరల్డ్ కప్ విజయం కళ్లకు కట్టేసింది..!

80స్ లో ఇండియాలో క్రికెట్ కు అంత ఆదరణ ఏమీ లేదు. 1983లో వరల్డ్ కప్ జరుగగా అందులో టీమిండియా కూడా పాల్గొంది. అయితే టీమ్ ఇండియా కప్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా అండర్ డాగ్ లా టీమిండియా బరిలోకి దిగింది. అప్పట్లో వెస్టిండీస్ జట్టు అంటే ప్రపంచ క్రికెట్లో బలంగా ఉండేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై కూడా అంచనాలు ఉన్నాయి. సెమిస్ లో టీమిండియా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 17పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక టీమిండియా ఓటమి ఖాయమనే అనుకున్నారు.. అంతా.

అప్పుడు బరిలోకి దిగాడు కెప్టెన్ కపిల్ దేవ్. 138 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత ఫైనల్లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 183 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయినా వెస్టిండీస్ ని కట్టడి చేసి ఫైనల్లో విజయం సాధించి వరల్డ్ కప్ ను తొలిసారిగా ముద్దాడింది. వరల్డ్ కప్ విజయంతో ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.

1983 వరల్డ్ కప్ లో టీమిండియా విజయంపై ప్రస్తుతం బాలీవుడ్ లో 83 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ గా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ నటిస్తున్నారు. ఆయన భార్య రోమీ దేవ్ గా దీపికా పదుకునే నటిస్తోంది. నిజజీవితంలో భార్యాభర్తలైన వీరు తెరపై కూడా భార్యాభర్తలుగా నటించడం విశేషం. 83 ట్రైలర్ ఇవాళ విడుదలైంది. వరల్డ్ కప్ లో జింబాబ్వేపై ఉత్కంఠభరిత విజయం, ఫైనల్లో అగ్ర జట్టు అయిన వెస్టిండీస్ ను ఓడించి కప్పు అందుకోవడం వంటి ఘటనలను ట్రైలర్ లో చూపించారు.

వరల్డ్ కప్ లో విజయం తాలూకు భావోద్వేగాన్ని చక్కగా ఆవిష్కరించారు. కపిల్ దేవ్ లా రణవీర్ బాగా ఒదిగిపోయాడు. 83 సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24వ తేదీన విడుదలవుతోంది.