`ఒమిక్రాన్‌` ఎఫెక్ట్‌.. టాలీవుడ్‌లో మొద‌లైన‌ టెన్ష‌న్‌?!

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎంత‌లా న‌లిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. థియేట‌ర్లు మూత ప‌డ‌టం, షూటింగ్స్ నిలిచిపోవ‌డం కార‌ణంగా సినీ కార్మికులు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. ఇక క‌రోనా ప్ర‌భావం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న టాలీవుడ్‌కు మ‌రో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. అదే `ఒమిక్రాన్‌`.

కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటప‌డి ప్ర‌జ‌ల‌పై శ‌ర‌వేగంగా విరుచుకుప‌డుతోంది. ఈ ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, దాని వ్యాప్తి ప్రపంచానికే ముప్పు అని ఇప్ప‌టికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచదేశాలు.. ఒమిక్రాన్ ను ఎలా అదుపు చేయాలా అని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఒమిక్రాన్ ప్రభావం మాత్రం టాలీవుడ్ పై గట్టిగా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో భ‌యాందోళ‌న‌లు స్టార్ట్ అయ్యాయి. అస‌లే టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. అంతా సెట్ అయిందని భావించిన బడా నిర్మాతలు డిసెంబర్ నుంచి పెద్ద సినిమాల(అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్‌) రిలీజులు పెట్టుకున్నారు.

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయ‌క్‌ లాంటి చిత్రాలు సంక్రాంతి రేసులో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఒమిక్రాన్ బ‌య‌ట‌ప‌డ‌టం, క‌రోనా కంటే ఆరు రెట్లు వేగంగా అది విజృంభిస్తుండ‌టంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక పొర‌పాటు ఒమిక్రాన్ తీవ్ర‌త‌ర‌మైతే ప్ర‌భుత్వాలు మ‌రోసారి లాక్‌డౌన్ విధించినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.